వెంగళరావునగర్, నవంబర్ 2 :సర్కార్ బడిపై, ఇండ్లపై హైటెన్షన్ విద్యుత్ తీగలు ఒక్కసారిగా తెగిపడ్డాయి. పెద్ద శబ్ధంతో నాలుగు ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయాయి. 8 గంటల సమయంలో హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి సర్కారు బడి భవనం, స్థానికుల ఇండ్లపై పడిపోవడంతో సర్కారు బడి, ఇండ్లల్లో నుంచి ఆర్తనాదాలు చేస్తూ జనం బయటకు పరుగులు తీశారు. సోమాజిగూడలోని ఎల్లారెడ్డిగూడ వడ్డెర బస్తీలోని ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఉదయం ప్రార్థన చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
గతంలో ఎత్తరి మనీలా అనే మహిళ హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు పోగొట్టుకున్నది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా విద్యుత్ శాఖాధికారుల్లో చలనం లేకపోవడంతో ఆగ్రహించిన మహిళలు, స్థానికులంతా కలిసి శ్రీనగర్‌కాలనీలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ఆందోళన నిర్వహించారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైటెన్షన్ విద్యుత్
తీగలను భూగర్భం నుంచి వేయాలి: కార్పొరేటర్ సంగీతా శ్రీనివాస్‌యాదవ్
ప్రమాదభరితంగా మారిన హైటెన్షన్ విద్యుత్ తీగలను ఇండ్లు, బడి వద్ద నుంచి తొలగించి..ఈ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ కరెంటు కేబుళ్ల పనులను అధికారులు వెంటనే చేపట్టాలని సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీతా శ్రీనివాస్‌యాదవ్ కోరారు. పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలను కార్యరూపం దాల్చేందుకు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. మున్ముందు ప్రమాదాలు జరగకుండా ప్రజల ప్రాణాలను రక్షించేందుకు హైటెన్షన్ కరెంటు తీగలను భూగర్భం నుంచి వేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
ప్రభుత్వం మారడంతో పెండింగ్‌లో పనులు
ఇప్పటికే ఈ లైన్ తొలగింపునకు సిఫార్సు చేశామని, ప్రభుత్వం మారడంతో పెండింగ్‌లో ఉన్నదని, త్వరితగతిన ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని ఏడీఈ ప్రేమ్‌కుమార్ తెలిపారు. స్థానికులకు భరోసా ఇచ్చారు. పంజాగుట్ట, రహ్మత్‌నగర్ లో సైతం విద్యుత్ సరఫరా లోపాలతో హైటెన్షన్ తీగలు తెగాయని వీటికి మరమ్మతులు చేస్తున్నామని,శాశ్వత పరిష్కారాలను చేపడతామని చెప్పారు.
సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన జనం
విద్యుత్ శాఖ నిర్లక్ష్య వైఖరితో తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నదని ..తక్షణమే సర్కారు బడి, ఇండ్లపై ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలను తొలగించాలని డిమాండ్ చేస్తూ మహిళలు, స్థానికులంతా శ్రీనగర్‌కాలనీ విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట గతేడాది మరణించిన ఎత్తరి మనీలా చిత్రపటాన్ని కార్యాలయం గోడకు అతికించి ఆందోళన నిర్వహించారు. సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీతా శ్రీనివాస్‌యాదవ్,వడ్డెర బస్తీ ప్రెసిడెంట్ లక్ష్మణ్, కార్యదర్శి వేణు, స్థానిక ఎంఐఎం నాయకుడు ఎర్ర నగేశ్ అక్కడికి చేరుకుని స్థానికులకు మద్దతు పలికారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరుగకుండా ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేయాలని కార్పొరేటర్ వనం సంగీతా శ్రీనివాస్‌యాదవ్ సూచించగా, వెంటనే అధికారులు కరెంటు సరఫరాను నిలిపివేశారు.