సిటీబ్యూరో, నవంబర్ 5(నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో భారీగా ఓటర్లు ఉన్నా.. ఓటేసేవాళ్లు తక్కువ. వచ్చినా భారీ క్యూ లైన్లు తిరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇక గంటల తరబడి క్యూ లైన్లలో ఎలా నిలబడలి..? అంటూ ఇంటికే పరిమితమయ్యే వారుంటారు. అలాంటి వారందరినీ దృష్టిలో ఉంచుకొని మహానగరంలో ఎన్నికల అధికారులు ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తున్నారు. గ్రేటర్లో ఓటర్ నమోదు, డోర్ టూ డోర్ క్యాంపెయిన్ పేరిట ప్రత్యేక కార్యక్రమాలతో ప్రతి ఓటర్ వద్దకు ఎన్నికల అధికారులు వెళ్తుండగా.. తాజాగా పోలింగ్ రోజున ఓటర్లను ఇంటికి పరిమితం కాకుండా ముందస్తు మెసేజ్‌లను పంపేందుకు బల్దియా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మెసేజ్‌ల ద్వారానే ఓటర్ పోలింగ్ స్టేషన్, అక్కడి క్యూ లైన్ల పరిస్థితిని తెలుసుకునే సదుపాయాన్ని తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగదశలో ఉండగా.. ఎన్నికల తేదీ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని బల్దియా వర్గాలు చెబుతున్నాయి.
ఎన్నికలు ఏవైనా అర్బన్‌లో ఓటింగ్ ప్రక్రియ అత్యంత తక్కువగా నమోదవుతుంది. ఈ క్రమంలో టెక్నాలజీ ఆధారిత సేవలతో అర్బన్ ఓటర్లను ఆకట్టుకునేలా అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అంచనా ప్రకారం అక్షరాస్యులు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు. గత ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ నమోదైన ప్రాంతాలను గుర్తించగా, ఓటు వేయకపోవడానికి గల కారణాలను అన్వేషించారు.
ఈ క్రమంలో మెజార్టీ ఓటర్లు భారీ క్యూ లైన్లు, మౌలిక వసతులు లేకపోవడమేనని వ్యక్తం చేసిన అభిప్రాయాలతో.. పోలింగ్ స్టేషన్ల వద్ద టాయిలెట్లు, వాటర్ ఫెసిలిటీ, షాడో నెట్స్ వంటి సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. మరోవైపు గ్రేటర్లో ఇంటింటి ప్రచారంతోపాటు, డోర్ స్టిక్కరింగ్ వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయినా కూడా ఓటరు గడప దాటి బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపడంలేదనే అపవాదు ఉన్నది. ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నారు.
ఇప్పటికే గ్రేటర్ వ్యాప్తంగా మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు, యంగ్ ఓటర్లు థీమాటిక్ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా పోలింగ్ బూత్‌ల వద్ద ఉన్న క్యూ లైన్ వివరాలను స్థానికంగా ఉండే ఓటర్లకు ఎప్పటికప్పుడు తెలిపితే ఓటింగ్ పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీనికోసమే ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి, బల్క్ ఎస్ఎంఎస్ ద్వారా క్యూ లైన్ అప్డేట్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.