అబిడ్స్, సెప్టెంబర్ 21:ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం జరిగిన ఎగ్జిబిషన్ సొసైటీ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత 82ఏండ్లుగా ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్)ను నిర్వహిస్తూ వస్తున్నారు. నుమాయిష్ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంతో తెలంగాణ రాష్ట్ర వ్యా ప్తంగా 19 విద్యా సంస్థలను నెలకొల్పి విద్యా వ్యాప్తికి కృషి చేస్తున్నారు. ఆయా విద్యా సంస్థల ద్వారా ప్రతి ఏటా అనేక మంది విద్యార్థులు విద్యనభ్యసించడంతోపాటు ఇక్కడ విద్యనభ్యసించిన వారు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. ఎగ్జిబిషన్ సొసైటీకి ప్రతి ఏడాది ఎన్నికలు నిర్వహించి నూతన కార్యవర్గా న్ని ఎన్నుకుంటారు. కార్యవర్గం నుమాయిష్ నిర్వహణకు కృషి చేస్తున్నది.
నూతన కార్యవర్గం
ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి టి.హరీశ్‌రావు, ఉపాధ్యక్షుడిగా వనం సత్యేందర్, కార్యదర్శిగా బి.హనుమంతరావు, సంయుక్త కార్యదర్శిగా చంద్రజిత్‌సింగ్, కోశాధికారిగా ఏనుగుల రాజేందర్‌కుమార్, మేనేజింగ్ కమిటీ సభ్యులుగా అమర్‌జిత్‌రెడ్డి, ఆనంద్‌కుమార్ బొల్లా, అష్వక్ హైదర్, జీఆర్ అశోక్, మహ్మద్ ఫయీముద్దీన్, పి.శ్రీనివాస్, వినయ్‌కుమార్ ముదిరాజ్, డాక్టర్ ప్రభాశంకర్, బీఎన్ రాజేశ్వర్, ఉమారాణి ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన ఈ పాలకవర్గం పదవీ కాలం ఏడాది పాటు కొనసాగుతుంది.