Social Media | సిటీబ్యూరో, అక్టోబర్ 24(నమస్తే తెలంగాణ) : ఎన్నికల ప్రచారం తీరు మారుతోంది. సాంప్రదాయక ప్రచారాలకు తోడుగా కొత్తగా టెక్నాలజీ ఆధారిత ప్రచారానికి పార్టీలు తెరలేపాయి. ఇప్పటికే సోషల్ మీడియా మాధ్యమాల్లో బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహారిస్తోంది. తాజాగా పార్టీ ప్రచార కార్యక్రమాలను నేరుగా ఓటరుకు చేర్చేలా సరికొత్త ప్రణాళికలతో దూసుకుపోతున్నారు. అందరికీ అందుబాటులో ఉండే సోషల్ మీడియా యాప్ వాట్సాప్‌ను వేదికగా చేసుకుని క్షేత్రస్థాయికి తీసుకెళ్తున్నారు.
యూజర్ టూ ఓటర్ కాన్సెప్ట్‌తో బీఆర్ఎస్ ప్రణాళికను అమలు చేస్తుండగా… ప్రత్యేక గ్రూపులతో హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధిపై జనాలను చేరవేస్తున్నారు. ఇందుకు బూత్‌ల వారీగా, కాలనీల వారీగా ప్రత్యేక గ్రూప్‌లు, చానళ్లను క్రియేట్ చేసుకుని స్థానికంగా ఉండే యూజర్లలో విషయ పరిజ్ఞానాన్ని పెంచుతున్నారు.
ప్రస్తుతం వినూత్నమైన రీతిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే కాలనీ సంఘాలు, అపార్టుమెంట్ గ్రూపులతోపాటు, తాజాగా బూత్‌ల వారీగా ఓటర్లను ఆకట్టుకునేలా చేపట్టిన తాజా ప్రచారం తీరు జనాల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఎక్స్(ట్విట్టర్), ఫేస్బుక్లో వచ్చే బీఆర్ఎస్ కార్యక్రమాలను నేరుగా వీక్షించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండగా… ఎలాంటి ఆర్భాటం లేకుండా నేరుగా ఓటరైన యూజర్‌కు పార్టీ కార్యక్రమాలను తీసుకెళ్లడంలో సమర్ధవంతంగా పనిచేస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు.