సిటీబ్యూరో, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జిల్లాలో చదువుకున్న వారే ఓటు హక్కు వినియోగానికి దూరంగా ఉంటున్నారన్న అపవాదు ఉన్నదని, ప్రతి ఒక్కరూ పోలింగ్ రోజున హాలిడే అని భావించకుండా విద్యావంతులంతా ఆయా పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్‌రాస్ విజ్ఞప్తి చేశారు.
ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని కోరారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పన్వర్‌హాల్‌లో ఎన్జీవో, రెసిడెన్షియల్ సంస్థలతో జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్‌రాస్ సమావేశం నిర్వహించారు. 18 ఏండ్లు నిండిన యువతీ, యువకులు ప్రతి ఒక్కరూ ముందస్తుగా ఓటరు జాబితాలో తమ పేరును పరిశీలించుకోవాలని తెలిపారు.
తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ల వివరాలు పూర్తి స్థాయిలో తెలుసుకోవాలని, ఇందుకు సంబంధించిన ఎటువంటి సందేహాలు ఉన్నా తమ పరిధిలోని బూత్ లెవల్ ఆఫీసర్‌ను కానీ, ఓటరు హెల్ప్‌లైన్ ద్వారా గానీ, టోల్ ఫ్రీ నంబర్ 1950 ద్వారా వివరాలు ముందస్తుగా తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్ల అడ్రెస్ కోసం గూగుల్ మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. వీటిపై అవగాహన కల్పించడానికి రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు, ఎన్జీవోలు తమ వంతు సహకారం అందించాలని రొనాల్డ్‌రాస్ కోరారు.
ఎన్నికల సంఘం దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక సౌకర్యం కల్పించాలని సూచించినట్లు తెలిపారు. వీటితో పాటు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా రూపొందించిన పోల్క్యూరూట్ యాప్ ద్వారా పోలింగ్ స్టేషన్ వద్ద క్యూలో ఎంత మంది ఓటర్లు ఉన్నారో తెలుసుకోవచ్చని.. ఈ సమాచారం యాప్‌లో పొందుపరుస్తామని కమిషనర్ తెలిపారు. ఈ యాప్ సహాయంతో ఓటర్లు తమకు అనుకూలమైన సమయంలో నేరుగా పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు.