దుండిగల్, ఫిబ్రవరి 2: దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చర్చిగాగిల్లాపూర్కు చెందిన చిన్నపాటి సుశీలమ్మ(75) ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నది. ఆమె ముగ్గురు కుమారులు వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. సోమవారం సాయంత్రం స్థానికుల నుంచి పోలీసులు డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్నారు. ఘటనాస్థలికి వెళ్లి చూడగా, సుశీలమ్మ తన ఇంట్లోని సోఫాలో రక్తపుమడుగులో పడి ఉన్నది. దుండగులు బలమైన కర్ర, ఇనుపరాడ్డుతో ఆమె తలపై బలంగా బాదడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.