బంజారాహిల్స్,అక్టోబర్ 19: ‘కేసీఆర్ సారు మాకు కడుపునిండా తిండి పెట్టారు..బట్టలు ఇచ్చాడు.. పింఛన్ ఇచ్చాడు.. ఆయనను కచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం.. బతికి ఉన్నంత వరకు ఆయనకే ఓటేస్తాం..’ అంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వృద్ధులు తమ ఇంటివద్దకు ప్రచారానికి వస్తున్న బీఆర్ఎస్ నాయకులకు భరోసా ఇస్తున్నారు.
ఆదివారం రహ్మత్‌నగర్ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఇంటింటి ప్రచారంలో పలువురు వృద్ధులు కరపత్రంపై ఉన్న కేసీఆర్ ఫొటోను చూడగానే రూ.200 ఉన్న పింఛన్‌ను 2వేలకు పెంచిన దేవుడు అంటూ దండం పెట్టారు. తమ కష్టసుఖాలు చూసిన కేసీఆర్‌ను మేము గుర్తుచేసుకుంటామని ఓ వృద్ధురాలు చెప్పగా, తమ ఇంట్లోని నాలుగు ఓట్లు కేసీఆర్‌కే వేయిస్తామంటూ మరో వృద్ధురాలు చెప్పడం రాజేందర్‌రెడ్డితో పాటు కార్యకర్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎక్కడకు వెళ్లినా మహిళలు బయటకు వచ్చి తామంతా కేసీఆర్‌కే ఓటేస్తామని చెబుతున్నారని రాజేందర్‌రెడ్డి తెలిపారు.