King Cobras | హైదరాబాద్ : ఆదిభట్ల పోలీసు స్టేషన్ పరిధిలో నిర్బంధించిన నాగుపాములను జంతు ప్రేమికులు రక్షించారు. సూరంగుట్టలోని శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయం వద్ద నాగుపాములను ప్రదర్శనకు ఉంచి, వాటిని హింసిస్తున్నట్లు గ్రేటర్ హైదరాబాద్కు చెందిన జంతు ప్రేమికులకు సమాచారం అందింది. దీంతో జంతు ప్రేమికులు అక్కడికి చేరుకుని ఎనిమిది నాగుపాములను స్వాధీనం చేసుకున్నారు.
నాగుల చవితి నాటి నుంచి ఈ దేవాలయం వద్ద నాగుపాములను ప్రదర్శించి, భక్తుల నుంచి డబ్బులు దండుకుంటున్నట్లు జంతు ప్రేమికుల విచారణలో తేలింది. స్థానిక పోలీసుల సహాయంతో పాములను, పాములు పట్టేవారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఎనిమిది నాగుపాములు కూడా పూర్తిగా నీరసించిపోయాయని జంతు ప్రేమికులు తెలిపారు.
ఎనిమిది నాగుపాములకు డాక్టర్ విశ్వ చైతన్య ఆధ్వర్యంలో చికిత్స కొనసాగుతుందన్నారు. జీహెచ్ఎస్పీసీఏ కోఆర్డినేటర్ సౌధర్మ భండారి ఆదిభట్ల పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాగుపాములను రక్షించిన వారిలో జీహెచ్ఎస్పీసీఏ సభ్యులు ప్రఫుల్ జైన్, స్టార్, ఫరాజ్, టిల్లు, పీయూష్ ఉన్నారు.