బడంగ్‌పేట, మార్చి 8: మహిళలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి ప్రారంభించి, చందన చెరువుకట్ట పై మొక్కలు నాటారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ 50 శాతం రిజర్వేషన్లు కల్పించి, మహిళా సంక్షేమానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో తాగునీటి కోసం మహిళలు బిందెలు పట్టుకొని బయటకు వెళ్లే వారని గుర్తు చేశారు. మహిళల ఆత్మగౌరవం కోసం మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చి సీఎం కేసీఆర్ ప్రతి గడపకు తాగునీటిని అందించారని తెలిపారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రుణాలిచ్చి వ్యాపారం చేయడానికి చేయూత ఇస్తున్నారని చెప్పారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం షీటీమ్స్‌ను ఏర్పాటు చేసి ఆకతాయిల ఆట కట్టిస్తున్నదన్నారు. ఆడ బిడ్డల పెండ్లి చేయలేక ఇబ్బంది పడుతున్న పేదింటి యువతుల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ మేనమామ లాగా ఆదుకుంటున్నాడని తెలిపారు.ఈ పథకాల ద్వారా బాల్య వివాహాలు కూడా తగ్గాయని పేర్కొన్నారు.
మగ పిల్లలకు దీటుగా పెంచాలి
మగ బిడ్డను ఏ విధంగా పెంచుతున్నామో ఆడ బిడ్డను అలాగే పెంచాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గతంలో అమ్మాయిలు చదువుకోవడానికి అవకాశాలు ఉండేవి కావని, అబ్బాయిలకు సమానంగా అమ్మాయిలను చదించాలన్నారు. ప్రస్తుతం యూనివర్సిటీల్లో 70 శాతం అమ్మాయిలు చదువుతున్నారని తెలిపారు. కళాకారులు పాడిన పాటలు, మహిళా కార్పొరేటర్ సౌందర్య పాడిన పాట పలువురిని ఆకట్టుకున్నాయి. వివిధ రంగాల్లో ప్రతిభ ఉన్న వారిని మంత్రి సన్మానించారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు కృషి చేసిన కార్పొరేటర్లు సిద్ధాల లావణ్య బీరప్ప, అక్కి మాధవి, తదితరులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ సీహెచ్ నాగేశ్వర్ , డీఈఈ గోపీనాథ్, కా ర్పొరేటర్లు, వైద్యులు, పోలీసులు, అధికారులు పా ల్గొన్నారు.