సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : డీఎస్సీ 2024కి ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు వస్తుండటంతో విద్యాశాఖ పునఃపరిశీలనకు నిర్ణయించింది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పునః పరిశీలించాలని నిర్ణయించింది. ఈనెల 20 నుంచి ఈ ప్రక్రియను నిర్వహించాలంటూ సర్క్యూలర్ జారీ చేసింది.
దీంతో స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించనున్నారు. గ్రేటర్ పరిధిలో స్పోర్ట్స్ కోటా కింద సుమారు 84 మంది అభ్యర్థులు ఎంపికై విధులు నిర్వహిస్తున్నారు. అందులో హైదరాబాద్లో 71 మంది, రంగారెడ్డి జిల్లాలో 13 మంది ఎంపికయ్యారు. ఈనెల 20న హైదరాబాద్ పరిధిలోని అభ్యర్థులకు, 21న రంగారెడ్డి జిల్లా పరిధిలోని అభ్యర్థులకు దోమలగూడలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉండనున్నది.