కేపీహెచ్బీ కాలనీ, నవంబర్ 9: ప్రపంచ వేదికపై భారతదేశం బలమైన స్థానం సాధించిందని, యువత సముద్ర పరిశోధన నుంచి అంతరిక్ష పరిశోధన వరకు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి అన్నారు. జేఎన్యూహెచ్ వర్సిటీలో శనివారం నిర్వహించిన నాల్గవ భారత అంతర్జాతీయ పరిశ్రమ ఇంజినీరింగ్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ సదస్సు ముగింపు సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ వి.బాలకృష్ణారెడ్డి, వర్సిటీ రెక్టార్ విజయ్ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ కె.వెంకటేశ్వర్రావు, మాజీ రిజిస్ట్రార్, సదస్సు చైర్మన్ మంజూర్ హుస్సేన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అండ్ సాంకేతికతను కలిపి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతరిక్ష, సముద్ర చట్టాలు వంటి రంగాల్లో చట్టం గురించి అవగాహన టెక్నాలజీ నిపుణులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 18వ శతాబ్దంలో పారిశ్రామీకరణ, 19వ శతాబ్దంలో యాంత్రీకరణ, 20వ శతాబ్దంలో డిజిటలైజేషన్, 21వ శతాబ్దంలో టెక్నాలజీ కాలమని వివరించారు. విద్యార్థులు ఈ తరహా సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నూతన అంశాలపై దృష్టిని సారించాలని, భారతదేశాన్ని సాంకేతికతలో అగ్రగామిగా నిలుపాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో 200 పరిశోధనలు సమర్పించారు. కార్యక్రమంలో ప్రపంచ దేశాలకు చెందిన పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.