సిటీబ్యూరో, డిసెంబర్ 28(నమస్తే తెలంగాణ): డ్రగ్స్ ఫ్రీ తెలంగాణే తమ ముఖ్య లక్ష్యమని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి అన్నారు. శనివారం నాంపల్లి, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోని గాంధీ సెంటనరీ హాల్లో ఏర్పాటు చేసిన అబ్కారీ శాఖ వార్షిక సమావేశంలో జాయింట్ కమిషనర్లు కే.ఏ.బీ.శాస్త్రి, ఖురేషీ, ఎస్టీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ ప్రణవి, ఈఎస్‌లు ప్రదీప్‌రావు, నంద్యాల అంజిరెడ్డిలతో కలిసి ఎక్సైజ్ వార్షిక నివేదికను విడుదల చేశారు. అనంతరం ఈడీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలను పూర్తిగా నిర్మూలించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధానిపై ప్రత్యేక దృష్టిసారించామని, ఇందులో భాగంగా ఇప్పటికే ‘ఆపరేషన్ ధూల్‌పేట’ను ఈ సంవత్సరం జూలైలో ప్రారంభించామన్నారు.
దాని ద్వారా ధూల్‌పేట ప్రాంతంలో గంజాయిపై ఉక్కుపాదం మోపి, దాదాపు 95శాతం వరకు గంజాయి విక్రయాలను నిర్మూలించగలిగామన్నారు. ఇదే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి, నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్, గుడుంబా, డ్యూటీ ఫ్రీ లిక్కర్‌తోపాటు ఇతర అన్ని రకాల అబ్కారీ నేరాలను నియంత్రించేందుకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందన్నారు. ముఖ్యంగా ఎన్డీపీఎస్తోపాటు ఇతర అన్ని రకాల అబ్కారీ నేరాల కేసులకు సంబంధించి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్డీపీఎస్తోపాటు ఇతర అబ్కారీ నేరాల్లో నిందితుల కన్విక్షన్ రేటు కేవలం 2.5 శాతంగా ఉందని, దీని వల్ల నిందితులు మళ్లీ మళ్లీ నేరాలకు పాల్పడే అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. అందుకని అబ్కారీ నేరాల్లో దర్యాప్తును పకడ్బందీగా జరిపి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామని, కేసు వీగిపోకుండా పటిష్టమైన దర్యాప్తుపై ఇప్పటికే అబ్కారీ అధికారులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందన్నారు.
2.07% పెరిగిన గుడుంబా తయారీ కేసులు
గుడుంబా తయారీ కేసులు 2.07శాతం పెరిగినట్లు ఈడీ వివరించారు. 2023లో 20,803 ఐడీ తయారీ కేసులు నమోదుకాగా, 11,713 మంది నిందితులను అరెస్టు చేసి, 1,30,696 లీటర్ల ఐడీతో పాటు 1,807 వాహనాలను సీజ్ చేయగా, 2024లో 21,234 కేసులు నమోదు చేసి, 12,727మందిని అరెస్టు చేసినట్లు వివరించారు. ఈ కేసుల్లో 1,04,730ఐడీ లిక్కర్‌తోపాటు 2173 వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు వివరించారు.
తగ్గిన ఎన్డీపీఎల్ కేసులు
నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ కేసులు గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది భారీగా తగ్గినట్లు ఈడీ వెల్లడించారు. 2023లో 1,908 ఏడీపీల్ కేసులు నమోదవగా, 990 మంది నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 29,561లీటర్ల ఇతర రాష్ర్టాలకు చెందిన ఎన్డీపీఎల్ మద్యంతోపాటు 149వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. 2024లో ఎన్ఫోర్స్మెంట్ నిఘా కారణంగా ఈ కేసులు 800కు పడిపోయాయని, 10,613లీటర్ల ఎన్డీపీఎల్ లిక్కర్‌ను స్వాధీనం చేసుకుని 430మందిని అరెస్టు చేసి, 71వాహనాలను సీజ్ చేసినట్లు ఈడీ వివరించారు.
29.17శాతం పెరిగిన డ్రగ్స్ కేసులు
డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు సంబంధించిన ఎన్డీపీఎస్ కేసుల సంఖ్య గత సంవత్సరంతో పోల్చితే 29.17శాతం పెరిగినట్లు ఈడీ తెలిపారు. అయితే పెరుగుతున్న కేసులపై అదే స్థాయిలో ఉక్కుపాదం మోపుతున్నామని, ఈ క్రమంలోనే 2023లో 874ఎన్డీపీఎస్ కేసులు నమోదవ్వగా 1218 మందిని అరెస్టు చేసి, 6354.56 కిలోల గంజాయి, 38.25కిలోల ఆల్ప్రాజోలంను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 2024లో 1118ఎన్డీపీఎస్ కేసులు నమోదవ్వగా, 1991మంది నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి 6330కిలోల గంజాయి, 302 2కిలోల ఆల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు వివరించారు. అంతేకాకుండా ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 48.53కోట్ల విలువ చేసే 20,904కిలోల గంజాయి, ఎండీఎంఏ, ఆల్ప్రాజోలం, కొకైన్, ఓపియం తదితర డ్రగ్స్‌ను దహనం చేసినట్లు ఈడీ కమలాసన్‌రెడ్డి వెల్లడించారు. డ్రగ్స్ కేసుల్లో గత సంవత్సరం 14 మంది నిందితులకు శిక్ష పడగా 2024లో 26 మందికి శిక్ష పడినట్లు తెలిపారు. డ్రగ్స్ కేసుల్లో కన్విక్షన్ రేటు మరింత పెరిగేలా కేసుల దర్యాప్తులో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఈడీ వెల్లడించారు.
‘ఆపరేషన్ ధూల్‌పేట్’
రాష్ట్రంలో ఎక్కడ గంజాయి లభించినా దాని మూలాలు ధూల్‌పేటలో తేలుతున్నందున ఆ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఈడీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం జూలై 16న ‘ఆపరేషన్ ధూల్‌పేట్’ పేరుతో గంజాయిని పూర్తిగా రూపుమాపేందుకు ప్రత్యేక చర్యలు ప్రారంభించామని, ఇందులో భాగంగా ధూల్‌పేటతో పాటు దానికి సమాంతరంగా ఉన్న నానక్‌రామ్‌గూడ, కూకట్పల్లి తదితర ప్రాంతాలపై కూడా నిఘా పెట్టి, నిరంతరం దాడులు జరుపుతూ గంజాయి విక్రయదారులే కాకుండా వినియోగదారులు, సరఫరాదారులపై కూడా కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ధూల్‌పేటలో ప్రధాన గంజాయి వ్యాపారులైన 15కుటుంబాలను అరెస్టు చేశామని, దీంతో ధూల్‌పేట ప్రాంతంలో గంజాయి విక్రయాలను దాదాపు 95 శాతం నియంత్రిచగలిగామన్నారు. 100శాతం ఫలితాలు వచ్చేవరకు ఆపరేషన్ ధూల్‌పేట కొనసాగుతుందని ఈడీ తెలిపారు.
నూతన సంవత్సర వేడుకలపై ప్రత్యేక నిఘా
జీహెచ్ఎంసీ పరిధిలో జరగనున్న నూతన సంవత్సర వేడుకలపై ప్రత్యేక నిఘా పెట్టామని ఈడీ వెల్లడించారు. 40 ప్రత్యేక బృందాలను దింపామని, అందులో 17 బృందాలు పోలీసులు, టీజీన్యాబ్, అబ్కారీ సిబ్బంది కలిసి ఉంటాయని, మిగిలిన బృందాల్లో అబ్కారీ ఎన్ఫోర్స్మెంట్, ఎస్టీఎఫ్, డీటీఎఫ్ తదితర బృందాలు ప్రతినిత్యం పర్యవేక్షిస్తుంటాయన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ ప్రత్యేక బృందాలను పర్యవేక్షిస్తామని, ప్రతి గంటకు ఈ బృందాలు నివేదికలు సమర్పిస్తుంటాయన్నారు.