Ease of Moving index | ఆటంకం లేకుండా సాఫీగా ప్రయాణాన్ని సాగించేందుకు హైదరాబాద్ అనువైన నగరమని ఈజ్ ఆఫ్ మూవింగ్ ఇండెక్స్ వెల్లడించింది. ఈ విషయంలో ముంబై తర్వాత స్థానంలో సిటీ నిలిచిందని పేర్కొంది. దేశంలోని అభివృద్ధి చెందుతున్న నగరాలు, మెగా సిటీల్లో రవాణా వ్యవస్థ ఎలా ఉంది? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, వ్యక్తిగత వాహనాల వాడకం తదితర అంశాలపై దేశావ్యాప్తంగా ఓలా మొబిలిటీ ఇనిస్టిట్యూట్ ఫౌండేషన్ సర్వే నిర్వహించింది. హైదరాబాద్‌లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఫుట్‌పాత్‌ల నిర్మాణం బాగుందని కితాబిస్తూ.. ద్విచక్రవాహనాలకు పార్కింగ్ సౌకర్యమూ మెరుగ్గా ఉందని పేర్కొంది. నగరంలో చక్కటి ప్రజా రవాణా వ్యవస్థ ఉన్నా.. వ్యక్తిగత వాహనాల వాడకం అధికంగా ఉన్నట్లు తెలిపింది.
సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలకు తావు లేకుండా నిరంతరాయంగా ప్రయణాలు సాఫీగా సాగుతున్నాయని ఈజ్ ఆఫ్ మూవింగ్ ఇండెక్స్ 2022 ఇండియా సర్వే వెల్లడించింది. భారతదేశంలోని అభివృద్ధి చెందుతున్న నగరాలు, మెగా సిటీల్లో రవాణా వ్యవస్థ ఎలా ఉంది, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు, వ్యక్తిగత వాహనాల వాడకం తదితర అంశాలపై దేశ వ్యాప్తంగా ఓలా మొబిలిటీ ఇనిస్టిట్యూట్ పౌండేషన్ ఈ సర్వే నిర్వహించింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అత్యధిక మంది ప్రజా రవాణాను వినియోగిస్తూ, నెలవారీగా తక్కువ ఖర్చు చేస్తున్నారని, ఇక్కడ రాత్రి సమయంలోనూ రవాణా లభ్యత ఉందని వెల్లడించింది. 40 లక్షలకు పై జనాభా ఉన్న నగరాలను ఒక జాబితా, అంత కంటే తక్కువ జనాభా కల్గిన నగరాలను రెండు వేర్వేరు జాబితాలుగా తయారు చేసి ఈ నివేదికను రూపొందించారు. ఇందులో భాగస్వామ్య రవాణా, ఆటంకాలు లేని రవాణా, ప్రమాద రహిత రవాణా, అందరికి రవాణా సదుపాయం, అందుబాటులో ధరల్లో రవాణా, నమ్మకమైన రవాణా, కాలుష్య రహిత రవాణా వంటి అంశాలపై సర్వే నిర్వహించారు.
హైదరాబాద్‌లో ఇబ్బందులు లేని ప్రయాణం ..
హైదరాబాద్‌లో ఒక చోట నుంచి ఇంకో చోటకు చేరుకోవాలంటే ఆటంకాలు లేకుండా ప్రయాణించవచ్చని సర్వే వెల్లడించింది. ఇందులో ముంబై మొదటి స్థానంలో ఉండగా హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. వ్యక్తిగత వాహనాలతో పాటు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు కూడా నగరం నలుమూలల విస్తరించి ఉందని సర్వేలో వెల్లడించారు. హైదరాబాద్‌లో గతంలో ఓలా సర్వేలో వాహనాల వేగం మిగతా నగరాల్లో కంటే అధికంగా ఉందని, ఒక పక్క వాహనాలు పెరిగినా, వేగం తగ్గలేదని వివరించింది. ఇప్పుడు అదే రీతిలో నగరంలో ఆటంకం లేకుండా సాఫీగా ప్రయాణం సాగించేందుకు అనువైనదిగా పేర్కొంది. తెలంగాణ ఏర్పాటు కాకముందు (2014) లో హైదరాబాద్ 42 లక్షల వాహనాలున్నాయి, 2023 నాటికి 80 లక్షల వాహనాలు పెరిగాయి. వాహనాల సంఖ్య పెరుగుతున్నా ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ఉండేలా కొత్త కొత్త ఆలోచనలతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
విశాలమైన ఫుట్‌పాత్‌లు..
హైదరాబాద్, ముంబైలో ఫుట్‌పాత్‌లు విశాలంగా ఉండి మంచి కండీషన్లో ఉన్నాయని సర్వే తెలిపింది. హైదరాబాద్‌లో పాదచారుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఫుట్‌పాత్‌లను నిర్మించింది. గతంలో రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారిలో పాదచారులే ఎక్కువగా ఉండేవారు. ఈ సమస్యకు ప్రధాన కారణం ఫుట్‌పాత్‌లు లేకపోవడం, ప్రజల్లో ట్రాఫిక్ క్రమ శిక్షణ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించి, ఆ సమస్యలను పరిష్కరించింది. హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలు చాల వరకు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు సిస్టం బాగుందని సర్వే వెల్లడించింది. ప్రజలు ఎక్కువ సంఖ్యలో వ్యక్తిగత వాహనాల వాడకానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్వే వివరించింది.