సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే అంతర్జాతీయ ఫార్ములా -ఈ కార్ రేసింగ్‌కు విశ్వనగరం హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ-రేస్‌లో 11 జట్లు, 22 మంది డ్రైవర్లు పాల్గొననున్నట్లు నిర్వాహకులు గురువారం తెలిపారు. పీపుల్స్ ప్లాజాలో చిన్నారుల కోసం ఫ్యాన్ విలేజీ పేరుతో ఓ వేదికను ఏర్పాటు చేశారు. అంతేకాదు రేసింగ్ ట్రాక్ చుట్టూ ఎల్ఈడీ స్క్రీన్లను అమర్చారు. 2014లో బీజింగ్‌లో నిర్వహించి ఫార్ములా ఈ రేసింగ్‌కు గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ బ్రాండ్‌గా ఖ్యాతిగడించింది.
కాగా అంతర్జాతీయ ఫార్ములా -ఈ కార్ రేసింగ్ 2023లో విశ్వవేదికపై చరిత్రలో నిలిచేలా ఖైరతాబాద్‌లో నిర్వహించడం గొప్పవిషయంగా స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ-కార్లు గంటకు 280 కిలోమీటర్ల గరిష్ఠవేగంతో ప్రయాణించగలవని, 250 కేవీ పవర్ ద్వారా 0 నుంచి 100కిలోమీటర్ల వేగాన్ని 2.8 సెకన్లలోనే అందుకుంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు. మనదేశంలో నిర్వహించబోయే మొట్టమొదటి ఫార్ములా ఈ-రేసింగ్‌కు ఏర్పాట్లు చురుగ్గా పూర్తిచేశారు. ట్రాక్ పొడవునా మొత్తం 18 మలుపులు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
11జట్లు.. 22మంది డ్రైవర్లు..
ఈ నెల 11న జరిగే ఈ అంతర్జాతీయ ఈవెంట్లో మొత్తం 11జట్లు.. 22మంది డ్రైవర్లు పాల్గొననున్నారు. సందర్శకులకోసం ప్రత్యేకంగా 11 స్టాండ్లు, 7గేట్లను ఏర్పాటు చేశారు.
దేశ విదేశాల నుంచి సందర్శకుల రాక..
ప్రపంచంలోని ప్రధాన నగరాల నుంచి ఈ పోటీని తిలకించేందుకు వేలాది మంది వస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ చుట్టూ పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టడంతోపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించి ప్రయాణికులకు అవాంతరాలు ఏర్పడకుండా సూచిక బోర్డులను ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
సాంకేతిక సమస్యలు తలెత్తకుండా
ఫార్ములా-ఈ రేస్ సందర్భంగా ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. ఈ-కార్లలో ఫిట్టింగ్తో పాటు వాటి నిర్వహణ తదితర అంశాలను ఇంజినీర్లతో కలిసి పర్యవేక్షించారు. భద్రత దృష్ట్యా ఇతరులను కార్ల విడిభాగాల ప్రదేశాన్ని సందర్శించడానికి అనుమతిని నిరాకరించారు.
ఫ్యాన్ విలేజీ వేదిక..
పీపుల్ ప్లాజాలో చిన్నారుల కోసం ఫ్యాన్ విలేజీ వేదికను ఏర్పాటు చేశారు. ఈ-రేసింగ్ చూసేందుకు వచ్చే చిన్నారులు, విద్యార్థులు, యువత కోసం ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. వినోదాత్మక కార్యక్రమాలతో ఈ వేదిక ద్వారా చిన్నారులు ఉత్సాహంగా గడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఓ వేదికను ఏర్పాటు చేశారు.