దుండిగల్, మార్చి17: కుత్బుల్లాపూర్ నియోజక వర్గం ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న దుండిగల్ తండా లు, నిజాంపేట, ప్రగతి నగర్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో పరిశ్రమలు వెదజల్లుతున్న వాయు, రసాయన కాలుష్యాన్ని(ఇండస్టియ్రల్ పొల్యూషన్) నియంత్రించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు.
సోమవారం శాసనమండలిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొల్లారం, కాజీపల్లి, జీడిమెట్ల, గడ్డపోతారం పారిశ్రామిక వాడల నుంచి వెలువడుతున్న పారిశ్రామిక కాలుష్యంతో బాచుపల్లి, నిజాంపేట, ప్రగతి నగర్ తదితర ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాంకి వేస్ట్ మేనేజ్మెంట్ సంస్థలో రసాయన వ్యర్థాలు భూ భూగర్భంలోకి పంపింగ్ చేస్తుండడంతో పరిసర ప్రాంతాల్లోని భూగర్భ జలాలు కలుషితమై చుట్టూ కిలోమీటరు దూరంలో ని బోరు బావుల నుంచి రసాయన వ్యర్థాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై తాను పీసీపీ బోర్డు మెంబర్ తో మాట్లాడినా ఫలితం లేకుండా పోతున్నదన్నారు.