ఘటన -1
సిటీబ్యూరో/బేగంపేట, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ ) : నాలాల్లో కొట్టుకుపోయిన వినోబానగర్‌కు చెందిన దినేశ్ భార్య రాజశ్రీ కథ వింటే కన్నీళ్లు ఆగవు…ఆమె ఒక అనాథ..తల్లిదండ్రులు లేరు..అనాథాశ్రమంలోనే పెరిగింది. దినేశ్ ఆమెని ప్రేమ వివాహం చేసుకున్నాడు.. అనాథ అయిన తనకు ఓ తోడు దొరికిందని రాజశ్రీ సంబరపడింది..కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు..జీవితాంతం తోడుగా ఉంటాడని భావించిన దినేశ్.. ఇప్పుడు ఒంటరి చేసి సర్కారీ నిర్లక్ష్యానికి నాలాలో కొట్టుకుపోయాడు..మళ్లీ అనాథను అయ్యాయని రాజశ్రీ గుండెలు పగిలేలా రోదిస్తున్నది…ఆ కుటుంబానికి సర్కారు నుంచి ఒక్క రూపాయి కూడా సహాయం అందలేకపోవడం శోచనీయం.
ఘటన -2
అఫ్జల్ సాగర్ నాలాలో అర్జున్, రాము అనే మామ అల్లుళ్లు నాలా వరద ప్రవాహానికి కొట్టుకుపోగా..వారిలో అర్జున్ మృతదేహం ..సుమారు 80 కిలోమీటర్ల మేర కొట్టుకుపోయి వలిగొండ మండలం సంగెం గ్రామ సమీపంలోని మూసీ నది లోలెవల్ బ్రిడ్జి దగ్గర దొరికింది. ఇప్పటి వరకు ఈ కుటుంబానికి జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. కనీసం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆ కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. కుటుంబం పెద్ద దిక్కును కోల్పోవడంతో తమకు ఆధారం లేదని, ఆదుకోవాలని సదరు కుటుంబం విన్నవించుకుంటున్నా.. ప్రభుత్వం కనికరం లేకుండా చేస్తున్నది.
ఘటన -3
రాంగోపాల్‌పేట్ డివిజన్లో కస్తుర్బానగర్, వెంగళ్రావునగర్, కాచ్బౌలి, నల్లగుట్ట లోతట్టు ప్రాంతాలు వరద ప్రభావానికి గురయ్యాయి. వరదతో ఈ ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ఇంట్లోకి వచ్చిన వరదతో వస్తువులన్నీ నీట మునిగి ఇక్కడి ప్రజల బతుకును ఆగం చేసింది. తినడానికి తిండి లేకుండా బతుకు పోరాటం కష్ట సాధ్యంగా మారింది. ఈ పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలిచేందుకు మానవత్వంతో స్పందించి ముందుకు రావాల్సిన సర్కారు ఇప్పటి వరకు ఈ ప్రాంతాల్లో అటు అధికారులు కానీ, ఇటు మంత్రులు, మేయర్ పర్యటించిన దాఖలాలు లేవు.
కనీసం ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం వీరిని పట్టించుకున్న పాపాన పోలేదు. పుట్టెడు బాధతో ఉన్న వారికి కనీసం సానుభూతిని తెలియజేసేందుకుగాని, వారి కుటుంబాలకు ఆర్థిఖ సహాయాన్ని అందించేందుకుగాని ఇటు పాలకులు గాని, అటు ఉన్నతస్థాయి అధికారులు గాని ముందుకు రాకపోవడంతో ఈ సర్కారుకు మానవత్వం ఉన్నదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. అయితే అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల పక్షానే బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడి మేము ఉన్నామంటూ భరోసా ఇస్తూ వస్తున్నది.
ఈ నేపథ్యంలోనే ఆదివారం సనత్‌నగర్ నియోజకవర్గంలోని రాంగోపాల్‌పేట్ డివిజన్లో పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన 1500 కుటుంబాలకు మాజీ మంత్రి సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను ఇంటింటికీ వెళ్లి అందజేశారు. కష్టాల్లో ఉన్న తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. మందుగా డివిజన్లోని కస్తూర్బానగర్‌లో బాధిత కుటుంబాలకు ఇంటింటికీ వెళ్లి సరుకులు అందించారు.
ఈ సరుకుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్‌రావు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి పాల్గొని బాధిత కుటుంబాల ఇండ్లకు వెళ్లి నిత్యావసర వస్తువులను అందించారు. కస్తుర్బానగర్, వెంగళ్రావునగర్, కాచ్బౌలి, నల్లగుట్ట, చుట్టలబస్తీ ప్రాంతాల్లో బాధితుల ఇండ్ల వద్దకే వెళ్లి నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి ్జ తలసాని సాయికిరణ్‌యాదవ్, కార్పొరేటర్ హేమలతా, పార్టీ నాయకులు మల్లికార్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ముంపు ప్రాంతాల బాధితుల అభిప్రాయాలు…
కేసీఆర్ సర్కారే నయ్యముండే
మొన్న కురిసిన భారీ వర్షాలకు మా నల్లగుట్టలో నాలా పక్కను ఉన్న ప్రాంతాలన్నీ నాలా పరీవాహక ప్రాంతంలో నీట మునిగాయి. రెండు రోజులు నుంచి కంటిమీద కునుకు లేదు. ఇంట్లో సరుకులన్నీ తడిసిపోయాయి. మా బాధలను కాంగ్రెసోళ్లు పట్టించుకోవడం లేదు. కేసీఆర్ సర్కారే నయ్యముండే… ఎప్పటి కప్పుడు నాలాలను శుభ్రం చేసేవారు. అప్పడు గిట్ల మా ఇండ్లలోని మురికి నీరు రాలేదు.
– శోభ, నల్లగుట్ట సీ లైన్ (రాంగోపాల్‌పేట్ డివిజన్)
నాలాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి
నాలాల్లో పేరుకుపోయిన చెత్త చెదారాలను ఎప్పటి కప్పుడు శుభ్రం చేయించాలి. స్థానికులు ఎంత మొర పెట్టుకున్నా.. జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు. నాలాలలో చెత్త నిండిపోయి భారీ వర్షం వచ్చినప్పుడు పైకి వచ్చి ఇండ్లలోకి నీళ్లన్నీ వస్తున్నాయి. ఇక్కడ ఉన్న కార్పొరేటర్మో బీజేపీ వారు ఉన్నారు. వారిని కలిస్తే మా సమస్య ఏ మాత్రం వినడం లేదు. మాకు ఉన్న ఎమ్మెల్యేనే మా సమస్యలను పట్టించుకుంటున్నారు. రెండు రోజుల కిందట వచ్చి మా బస్తీ వాళ్ల బాధలు తెలుసుకొని మాకు కొంత వరకు సహాయం చేశారు. ఆయనకు కృతజ్ఞతలు.
– అశోక్, కస్తుర్భానగర్
బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి..
బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి…వాళ్లు అయితే పేదోడి సమస్యలను పట్టించుకుంటారు. ఈ కాంగ్రెస్ వాళ్లు బస్తీల్లో కంటికి కూడా కనిపించడం లేదు. ఇంకా వాళ్లు బస్తీ వాళ్ల సమస్యలు ఏం పట్టించుకుంటారు. వర్షాలకు మా బస్తీలన్నీ మునిగిపోయి మూడు రోజులు ఇబ్బందులు పడ్డాం. వరదలతో ఇబ్బందులు పడుతుంటే ఇటు వైపు ఒక్క కాంగ్రెస్ నాయకుడు వచ్చి చూసిందీ లేదు.
– జాహెద్ అలీఖాన్, నల్లగుట్ట సీ లైన్
బిక్కుబిక్కుమంటూ రెండు రోజులు గడిపాం…
మా బస్తీలో మొన్న కురిసిన వర్షానికి మా ఇండ్లన్నీ మునిగిపోయాయి. బిక్కుబిక్కుమంటూ రెండు రోజులు గడిపాం. కాంగ్రెస్ సర్కారు వారు ఏ ఒక్కరు కూడా మా బాధలు గురించి పట్టించుకోలేదు. ముంపు ప్రాంతాల్లో పర్యటించి మా బాధలను అడిగిన నాథుడే లేరు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ మా బాధలను చూసి బస్తీలోకి వచ్చి మా మంచి చెడ్డలు తెలుకున్నారు.
– ఫర్జాన, కస్తుర్బానగర్