సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగాణ): సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో సర్కార్ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ సేవలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. ఏడాది కాలంగా ఆరోగ్యశ్రీ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయడం లేదని..దీంతో అటు రోగులు, ఇటు వైద్యసిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే ఏడాది కాలంగా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయకపోవడంతో నగరంలోని ప్రభుత్వ దవాఖానలకు మందులు సరఫరా చేసే సప్లయర్స్ కొన్ని రోజులుగా ఆరోగ్యశ్రీ కింద సరఫరా చేసే మందులు, శస్త్రచికిత్సలకు సంబంధించిన ఇంప్లాంట్స్ వంటి వాటిని సరఫరా చేయడం నిలిపివేశారు. దీంతో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎంఎన్‌జే తదితర దవాఖానల్లో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధులకు సంబంధించిన ఔషధాలు చాలా ఖరీదైనవి కావడంతో క్యాన్సర్ రోగులపై ఆరోగ్యశ్రీ నిధుల ప్రభావం తీవ్రంగా కనిపిస్తుందంటున్నారు ఆయా దవాఖానలకు చెందిన అధికార వర్గాలు.
సిబ్బందికి అందని ప్రోత్సాహకాలు..
ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులకు చికిత్స అందించిన, శస్త్రచికిత్సలు జరిపిన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది తదితర వైద్య సిబ్బందికి ప్రత్యేక ఇన్సెంటివ్ లభిస్తుంది. అయితే గత సంవత్సరం కాలంగా ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎంఎన్‌జే తదితర ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్‌లో విధులు నిర్వహించే వైద్య సిబ్బందికి ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్ అందడం లేదని వాపోతున్నారు. కార్పొరేట్‌తో పోల్చితే సర్కార్ దవాఖానల్లో తక్కువ వేతనాలతో పనిచేస్తున్నామని, ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న తమకు గౌరవ ప్రదంగా అందించే ఇన్సెంటివ్స్ను కూడా సరిగ్గా ఇవ్వకపోతే ఎలా అని వైద్య సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.