సిటీబ్యూరో, మే 11 (నమస్తే తెలంగాణ): నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన మద్యాన్ని వినియోగించడమే కాకుండా ఆబ్కారీ అనుమతి లేకుండా విందులో పెద్ద ఎత్తున మద్యం వినియోగించిన ఒక ఫంక్షన్‌హాల్‌పై శంషాబాద్ డీటీఎఫ్ పోలీసులు దాడులు జరిపారు. ఈదాడుల్లో రూ.4లక్షల విలువ చేసే 64ఎన్డీపీఎల్ మద్యం సీసాలు, 3డ్యూటీపెయిడ్ మద్యం సీసాలు, కార్టన్ బీర్ సీసాలను సీజ్ చేశారు.
డీటీఎఫ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కథనం ప్రకారం…మొయినాబాద్‌లోని గోలమారి ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన ఒక విందులో నిర్వాహకులు ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండా పెద్ద ఎత్తున మద్యం అతిథులకు సరఫరా చేశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఆబ్కారీ డీటీఎఫ్ బృందం సదరు ఫంక్షన్‌హాల్‌పై దాడులు జరపగా నిర్వాహకులు అనుమతి తీసుకోకపోవడమే కాకుండా అక్కడ వినియోగిస్తున్న మద్యం కూడా ఇతర రాష్ర్టాలకు చెందిన నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్‌గా తేలింది.
దీంతో డీటీఎఫ్ పోలీసులు ఢిల్లీకి చెందిన 60 బ్లాక్ లేబుల్ మద్యం బాటిళ్లు, గోవాకు చెందిన 4 బాటిళ్లు, తెలంగాణకు చెందిన 3 లికర్లు బాటిళ్లు, 12 బీర్ బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. అంతేకాకుండా నాన్‌డ్యూటీపెయిడ్ మద్యం వినియోగించిన వ్యక్తితో పాటు ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి లైసెన్స్ లేకుండానే ఫంక్షన్హాల్లో మద్యం వినియోగానికి అనుమతి ఇచ్చిన ఫంక్షన్‌హాల్ నిర్వాహకుడిపై కూడా కేసు నమోదు చేసినట్లు శంషాబా ద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ తెలిపారు. ఈదాడుల్లో డీటీఎఫ్ సీఐ ప్రవీణ్ కుమార్‌తో పాటు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, సిబ్బంది గణేశ్, మల్లేశ్, నెహ్రూ, సాయి శంకర్, శేఖర్ పాల్గొన్నారు.