నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మే 27 (నమస్తే తెలంగాణ): సూర్యపేట డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె.పార్ధసారథితోపాటు ఇన్స్పెక్టర్ పి.వీరరాఘవులును మంగళవారం ఏసీబీ కోర్టు ఏదుట జైలు అధికారులు హాజరుపర్చారు. డబ్బులివ్వమని డిమాండ్ చేయడం కూడా నేరమేనని రిమాండ్ కేసు డైరీలో పేర్కొన్నారు. వచ్చేనెల 16వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఏసీబీ కోర్టు జడ్జి ఉత్తర్వులు జారీ చేశా రు. మంగళవారంనాటితో తొలి 14రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీ పూర్తయిన సందర్భంగా మరోసారి నిందితులిద్దరినీ ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపర్చారు.
సూర్యపేట 2-టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుదారుడిపై నమోదైన కేసులో తనను అరెస్ట్ చేయకుండా 35(3) బీఎన్ఎస్ఎస్ కింద నోటీసులివ్వాలని, స్కానింగ్ సెంటర్ను యథావిధిగా నడుపుకునేందుకు వెసులుబాటు కల్పించాలని పోలీసు అధికారులను కోరడం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నా డు. కాగా..సదరు అధికారులు రూ.25లక్షలు డిమాండ్ చేసి రూ.16 లక్షలకు కుదించి చెల్లించాలని డిమాండ్ చేసినట్టు ఏసీబీకు ఫిర్యాదు చేశాడు.
తన వద్ద అంత పెద్దమొత్తంలో డబ్బు లేకపోవడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించి వారిపై ఫిర్యాదు చేసినట్టు వివరించాడు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు సాక్ష్యాధారాలను సేకరించిన అనంతరం నిందితులపై కేసు నమోదు చేశారు. నాంపల్లిలోని ఎస్పీఈ ఏసీబీ కోర్టు ఎదుట ఏసీబీ అధికారులు హాజరుపర్చగా జడ్జి 14రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలించిన విషయం తెలిసింది.