శంషాబాద్ రూరల్, డిసెంబర్ 29 : మద్యం మత్తులో అతివేగంగా కారు డ్రైవింగ్ చేసిన ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు. ముందుగా వెళ్తున్న ఆటోతో పాటు పలు వాహనాలను ఢీకొట్టి హంగామా చేశాడు. వాహనాలు దెబ్బతిన్నాయి. గాయపడిన పలువురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన గురువారం శంషాబాద్ మండలం పాలమాకుల వద్ద జరిగింది. సీఐ శ్రీధర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ పట్టణంలోని సిద్ధాంతి బస్తీకి చెందిన వికాస్ గురువారం ఉదయం 9 గంటల సమయంలోనే పీకలదాక మద్యం తాగాడు. అదేమత్తులో కారును అతివేగంగా నడుపుతూ శంషాబాద్ నుంచి షాద్‌నగర్ వైపు బయలుదేరాడు.
మండలంలోని పాలమాకుల గ్రామం వద్దకు చేరుకోగానే ముందుగా వెళ్తున్న ఓ ఆటోను వేగంగా ఢీకొట్టాడు. అదే వేగంతో మరో మూడు వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో వాహనాలు దెబ్బతినడంతోపాటు పలువురికి గాయాలయ్యాయి. కారు డ్రైవర్ వికాస్‌కు మాత్రం పెద్దగా దెబ్బలు తగలలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయాలైన వారిని శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
కారులో మద్యం బాటిళ్లు..
మద్యం మత్తులో ఉన్న వికాస్ పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. కారులో మద్యం బాటిళ్లు కూడా లభించాయి. బ్రీత్ ఎనలైజర్‌తో వికాస్‌కు పరీక్షలు చేయగా.. 200 ఎంజీ వచ్చినట్టు పోలీసులు తెలిపారు.