Drunk and Drive | సిటీబ్యూరో, మే 4(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో మందుబాబులపై ట్రాఫిక్ పోలీసులు కొరడాఝళిపిస్తున్నారు. గత నాలుగునెలలుగా గ్రేటర్లో మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య గతం కంటే ఎక్కువగా ఉంటుందని ఇటీవల నమోదైన కేసులే చెబుతున్నాయి. నగరవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మద్యం తాగి నడుపుతున్నవారి వల్లే జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. డ్రంకెన్ డ్రైవ్‌లో వీకెండ్స్ శని, ఆదివారాల్లో పట్టుబడుతున్న కేసులే ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
రోజుకు సగటున 158 కేసులు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో (ఈనెల 2వ తేదీ వరకు)19,536 కేసులు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే ఈ కేసులు పెరిగాయని చెప్పాలి. 2023లో 43,940 కేసులు నమోదు కాగా, 2024లో 52,080 కేసులు నమోదయ్యాయి. ఒక్క ఏప్రిల్ నెలలోనే 4836 కేసులు నమోదయ్యాయి. 304 మందికి జైలుశిక్ష విధించినట్లు పోలీసుల గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు కొందరు మహిళలు కూడా ఈ డ్రైవ్‌లో పట్టుబడ్డట్లుగా తెలుస్తోంది. తనిఖీల్లో పట్టుబడినవారికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి బేగంపేట, గోషామహల్‌లలో ప్రత్యేకంగా కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ కమిషనరేట్ వ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్ రెగ్యులర్‌గా చేస్తున్నాం. రొటీన్‌గా చేసే కంటే ఎక్కువగా సమయం కేటాయిస్తే సాధారణ ప్రజానీకం ఇబ్బంది పడే అవకాశముంటుంది. ఈ నాలుగునెలల డ్రైవ్‌లో ఎక్కువగా యువతే మద్యంతాగి వాహనాలు నడిపినట్లుగా తెలుస్తోంది. తల్లిదండ్రులు వారికి వాహనాలిచ్చే సమయంలో ఖచ్చితంగా పిల్లలకు జాగ్రత్తలు చెప్పి పంపాలి. ఎక్కువగా బంజారాహిల్స్, పంజాగుట్టల్లో కేసులు నమోదవుతున్నాయి.
– రాహుల్‌హెగ్డే, డిసీపీ, ట్రాఫిక్ విభాగం, హైదరాబాద్