పెగ్గేసి…బండి నడుపుతున్నారా.. బీ కేర్ ఫుల్ .. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే.. మీరు చిక్కుల్లో పడినట్లే. అభియోగాలు రుజువైతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. వారితో పాటు ఇతరుల ప్రాణాలకూ ముప్పు వాటిల్లుతున్నది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రహదారుల భద్రత కోసం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్‌లతో మందుబాబుల భరతం పడుతున్నారు. ఉల్లంఘనదారులను కోర్టులో హాజరు పరిచి..శిక్ష పడేలా చేస్తున్నారు. పబ్‌లపై సైతం మోటార్ వెహికిల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఫలితంగా ఐటీ కారిడార్‌లో నెలరోజుల్లో యాక్సిడెంట్లు గణనీయంగా తగ్గిపోయినట్లు విశ్లేషణలో వెల్లడైంది.
సైబరాబాద్ పరిధిలో పబ్‌లలో మద్యం తాగి.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన కేసుల్లో చర్యలు ప్రారంభించారు. సుమారు 10 పబ్‌ల నిర్వాహకులపై పోలీసులు మోటార్ వెహికిల్ యాక్ట్ 188(మద్యం సేవించి వాహనాలను నడిపించండని ప్రేరేపించడం) కింద కేసులను నమోదు చేసి అభియోగాలను మోపుతున్నారు. ఇలా చేయడంతో చాలా మంది పబ్ నిర్వాహకులు మద్యం సేవించిన తర్వాత వాహనాలను నడిపే వారి సమాచారాన్ని డయల్ 100 ద్వారా స్థానిక పోలీసులకు ఇస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు.. నిర్వాహకుల్లో బాధ్యత పెరిగింది. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే అనర్థాలు.. చట్టపరంగా తీసుకునే చర్యలు.. అమలయ్యే శిక్షలు తెలిపే బ్యానర్లు, పోస్టర్లను పెట్టి అవగాహన కల్పిస్తున్నారు.
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీసుకుంటున్న కఠిన చర్యలతో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో డేంజర్‌జోన్‌గా పేరొందిన మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో నెల రోజులుగా రోడ్డు ప్రమాదాలు జరుగలేదని, ఒక మరణం కూడా చోటు చేసుకోలేదని తేలింది. ముఖ్యంగా వీకెండ్ రోజుల్లో ఈ ప్రాంతాల్లో కచ్చితంగా ఏదో ఒక చోట మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదాలకు కారణమయ్యేవారు. కానీ… సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్‌కుమార్ సారథ్యంలో పటిష్టమైన నిఘా పెట్టారు. ఎవర్నీ వదిలి పెట్టకుండా తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో చాలా వరకు మద్యం తాగి వాహనాలను నడిపించడం తగ్గిందని పోలీసులు చెబుతున్నారు.
వాహనదారుడి భద్రత కోసం చట్టపరంగా కఠినంగా ఉంటాం. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటున్నాం.స్థానిక కోర్టులు కూడా ఉల్లంఘనదారులకు శిక్షలు వేస్తుండటంతో రోడ్డు భద్రత పెరిగింది. ప్రయాణికులు సురక్షితంగా గమ్యానికి చేరుకోవడం కోసమే కఠినంగా నిబంధనలను అమలు చేస్తున్నాం. – ఎస్ఎం విజయ్‌కుమార్, డీసీపీ సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం