సిటీబ్యూరో, అగస్టు 21(నమస్తే తెలంగాణ): తాగి డ్రైవింగ్ చేసే వారిపై సైబరాబాద్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఏకంగా వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేస్తున్నారు. ఈ ఏడాది మొత్తం డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 23,368 మందిపై ట్రాఫిక్ అధికారులు కేసులు నమోదు చేశారు. వీటిలో 3,625 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేయాలని రోడ్డు రవాణా సంస్థ అధికారులకు సిఫార్సు లేఖలను రాశారు. అందులో 2119 మంది వాహనదారుల లైసెన్స్‌లను సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్‌ను నెల నుంచి ఏడాది వరకు విధిస్తున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడగానే ముందుగా అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను స్వాధీనం చేసుకుంటారు. ఆ వివరాలను డేటా బేస్‌లో నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత లైసెన్స్ రద్దుకు ఆర్టీవో అధికారులకు సిఫార్సు చేస్తారు. పట్టుబడిన మందుబాబుల వారి పూర్తి సమాచారం ట్రాఫిక్ పోలీసుల దగ్గర భద్రంగా ఉంటుంది. ఒక క్లిక్‌తో పూర్తి సమాచారం దొరికిపోతుంది. గతంలో ఎన్ని సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికాడు. ఎన్నిసార్లు లైసెన్స్ సస్పెండ్ అయింది. ఇతర ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు ఏమైనా ఉన్నాయా ఇలా ప్రతి అంశం నిక్షిప్తమై ఉంటుంది. వాహనదారులు కారణాలు చెప్పి.. తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాగా, లైసెన్స్ సస్పెండ్ అయినా తిరిగి వాహనాలు నడిపిస్తూ 31 మంది పోలీసులకు చిక్కారు. వారి వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు లైసెన్స్ లేకుండా నడిపించినందుకు మరో కేసును నమోదు చేసి కోర్టు ముందు నిలబెట్టారు.
డ్రంక్ అండ్ డ్రైవింగ్‌లో పట్టుబడే ప్రతి వాహనదారుడి లైసెన్స్‌ను స్వాధీనం చేసుకుంటాం. కోర్టులో చార్జిషీటు దాఖలు చేశాక న్యాయమూర్తి తీర్పుతో వారి లైసెన్స్ సస్పెన్షన్‌కు ఆర్టీవో అధికారులకు సిఫార్సు చేస్తున్నాం. సస్పెన్షన్ సమయంలో డ్రైవింగ్ చేస్తే మరో కేసు పెట్టి వాహనదారుడిని కోర్టు ముందు నిలబెడతాం. ప్రమాదాలను నివారించడం, రోడ్డు భద్రతను పెంచడమే మా లక్ష్యం. – సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి.. శిక్షపడితే.. ప్రభుత్వ ఉద్యోగం రాదని, కనీసం వీసా కూడా కష్టమేనని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ.. రోడ్డు ప్రమాదాలకు గురైతే.. ఐఆర్డీఏ నిబంధనల ప్రకారం.. ఇన్సూరెన్స్ కూడా లభించదని స్పష్టం చేస్తున్నారు. జూలై నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మొత్తం 2056 కేసులను నమోదు చేశారు. వీటిలో 1670 మందిపై చార్జిషీటు దాఖలు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారించిన న్యాయస్థానం ముగ్గురికి ఉదయం నుంచి కోర్టు వేళలు ముగిసే వరకు అవరణలో నిలబడాలని ఆదేశించగా, 1666 మందికి రూ. 1.74 కోట్ల జరిమానాను విధించింది. ఈ మందుబాబులందరికీ గోషామహల్ టీటీఐ మైదానంలో ట్రాఫిక్ పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు.