సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో (టీన్యాబ్)ను ఏర్పాటు చేసిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్, టీ న్యాబ్ డైరెక్టర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ ఏడాది మే 31న టీ న్యాబ్‌ను బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్లో ప్రారంభించారు. ఎన్డీపీఎస్ కేసులకు సంబంధించి రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా టీన్యాబ్ పనిచేస్తున్నది. కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతోంది. ఈ మేరకు బుధవారం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సీవీ ఆనంద్ టీన్యాబ్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. రెండు నెలల్లో సాధించిన పురోగతిని, మున్ముందు చేయాల్సిన పనులపై సిబ్బందికి దిశా నిర్ధేశం చేశారు.
జూన్, జూలై నెలల్లో టీన్యాబ్ 196 కేసులు నమోదు చేయగా.. అందులో 175 కేసులు గంజాయికి సంబంధించినవే ఉన్నాయన్నారు. ఇందులో 353 మందిని అరెస్టు చేయగా, ఎండీఎంఏ, హెరాయిన్, కొకైన్, ఓపీయం తదితర 21 డ్రగ్ కేసుల్లో 46 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు. ఆయా కేసుల్లో రూ. 26,01,34,650 విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేసినట్లు సీవీ ఆనంద్ వెల్లడించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని జూన్ నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులపాటు ‘మిషన్ పరివర్తన్’ పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. దీంతో జూలై 5న ఎన్సీఓఆర్డీ సమావేశం రాష్ట్రస్థాయిలో జరిగిందని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, టీ న్యాబ్ డైరెక్టర్ తదితర అధికారులు పాల్గొన్నారని, ఇతర విభాగాల సమన్వయంతో డ్రగ్స్‌ను పూర్తిగా అణిచివేసేలా చర్చించినట్లు తెలిపారు. టీన్యాబ్ లక్ష్యంపై సిబ్బందికి ఈ సమీక్షలో టీన్యాబ్ డైరెక్టర్ వివరించారు.
రెండేండ్ల నుంచి తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు చేస్తున్న కృషి, రాష్ట్రం నుంచి డ్రగ్స్‌ను పూర్తిగా తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గూర్చి వివరించారు. డ్రగ్స్ విక్రయాలలో అమ్మకం దారులు, వినియోగదారుల మధ్య చైన్ లింక్‌ను తెగ్గొట్టడం, అందుకు ఆయా డ్రగ్ ఫెడ్లర్స్ నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు కావాల్సిన టెక్నాలజీ, కేసుల పర్యవేక్షణ వంటి అంశాలపై చర్చించారు. ఎస్ఏఎఫ్ఈఎంఏ చట్టం కింద చర్యలు, డయల్ 100కు వచ్చే కాల్స్ రీ రూటింగ్, యాంటీ డ్రగ్ కమిటీల బలోపేతం వంటి అంశాలపై టీ న్యాబ్‌కు కొత్తగా వచ్చిన సిబ్బంది, అధికారులకు సీపీ వివరించారు.