సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ)/బండ్లగూడ : విదేశాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్న డ్రగ్స్‌ను నగరంలో విక్రయించేందుకు యత్నిస్తున్న ఒక నైజీరియన్ దేశస్తుడితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను టీజీన్యాబ్, నార్సింగి పోలీసులు సంయుక్తంగా కలిసి పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.30లక్షల విలువ చేసే 107గ్రాముల కొకైన్, 25గ్రాముల ఎస్టసీ డ్రగ్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సోమవారం రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు.
నైజీరియా దేశానికి చెందిన మ్యాక్స్ అలియాస్ ప్రిన్స్వెల్ అలియాస్ బుచ్చి అలియాస్ గాబ్రియెల్ స్వదేశం నుంచే డ్రగ్ మాఫియాను నడిపిస్తున్నాడు. స్టూడెంట్ వీసాలు, నకిలీ గుర్తింపు కార్డులతో తన అనుచరులను వివిధ దేశాలకు పంపించి డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే మ్యాక్స్ అనుచరుడైన చుకుమేక విస్డమ్ అన్యేక అలియాస్ విక్టర్ చుకు అలియాస్ చుకు ఎమెక డివైన్ 2022 డిసెంబర్ 26న స్టూడెంట్ వీసాపై సుడాన్ దేశస్తుడిగా చుకు విక్టర్ పేరుతో భారత్‌లోకి అడుగు పెట్టాడు.
అప్ప టి నుంచి దేశంలోని వివిధ రాష్ర్టాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. కాగా డ్రగ్స్‌కు బానిసలైన మణికొండ ప్రాంతానికి చెందిన గోపిశెట్టి రాజేశ్, బొమ్మ దేవర వీర రాజులు గోవాలో డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న క్రమంలో చుకు ఎమేక విస్డమ్తో పరిచయం ఏర్పడింది. డ్రగ్స్ విక్రయాలతో పెద్ద మొత్తంలో సంపాదించవచ్చనే దురాశతో చుకు ఎమేకతో కలిసి డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో 2023లో ముగ్గురు నిందితులు కొకైన్ విక్రయిస్తూ రాయదుర్గ పోలీసులకు పట్టుబడి జైలు శిక్ష అనుభవించారు.
అయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈనెల 22న మణికొండలోని అల్కాపురి టౌన్షిప్ వద్ద డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు టీజీన్యాబ్, నార్సింగి పోలీసు బృందా లు సంయుక్తంగా దాడులు జరిపి డ్రగ్స్ సరఫరా చేస్తున్న చుకు ఎమేకతో పాటు రాజేశ్, వీరరాజులను పట్టుకుని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.30లక్షల విలువ చేసే 107గ్రాముల కొకైన్, 25గ్రాముల ఎస్టసీ మాత్రలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
ఇదిలా ఉండగా 2022లో సుడాన్ దేశస్తుడిగా నకిలీ పాస్పోర్టుతో భారత్‌లోకి ప్రవేశించిన చుకు ఎమేక 2023లో నైజీరియన్ దేశం నుంచి పాస్‌పోర్టు పొందాడు. 2024, నవంబర్‌లో స్వదేశానికి తిరిగి వెళ్లి, సుడాన్ పాస్‌పోర్టును ధ్వంసం చేశాడు. తిరిగి 2024 డిసెంబర్ 13న నైజీరియన్ పాస్‌పోర్ట్‌పై తన నిజమైన పేరుతో భారత్‌లోకి ప్రవేశించాడు. గత నెల 29న మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో జరిగిన రేవ్‌పార్టీకి సైతం ఇతనే రాజేశ్ ద్వారా కొకైన్‌ను సరఫరా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.