సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు నల్లమందును తరలిస్తున్న రాజస్థాన్ గ్యాంగ్‌ను ఎల్బీనగర్ ఎస్ఓటీ, మీర్పేట్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి రూ. 1.25 కోట్ల విలువైన నల్లమందును స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు వెల్లడించారు. సోమవారం ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజస్థాన్‌కు చెందిన మంగిలాల్ అలియాస్ మంగిలాల్ భిష్ణోయ్ జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి స్టీల్ అండ్ రెయిలింగ్ పనులు చేస్తున్నాడు.
సంపాదన సరిపోకపోవడంతో తమ స్వస్థలానికి చెందిన వారితో కలిసి డ్రగ్స్‌ను తెచ్చి విక్రయించాలని ప్లాన్ చేశాడు. 2023లో మంగిలాల్ భిష్ణోయ్ రాజస్థాన్ నుంచి హెరాయిన్ తీసుకువస్తూ హయత్‌నగర్‌లో ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటనలో మరో ఇద్దరు కూడా అరెస్టయ్యారు. బెయిల్‌పై బయటకు వచ్చిన తరువాత మంగి లాల్ దాక, భీర రామ్ దాక, శంకర్‌లాల్, శ్రావణ్‌తో కలిసి ఒక ముఠాను ఏర్పాటు చేశాడు.
మధ్యప్రదేశ్‌కు చెందిన పింట్ అలియాస్ మోహన్‌సింగ్‌తో మాట్లాడి 53.5 కిలోల పప్పీ స్ట్రా(నల్లమందు)ను హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. మీర్పేట్ పోలీస్‌స్టేషనే పరిధిలో నాదర్గుల్ అశోక్రెడ్డినగర్లో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ డీసీపీ మురళీధర్ నేతృత్వంలోని బృందం దాడి చేసి ముఠాను పట్టుకుంది. గసగసాల నుంచి తయారు చేసేది నల్లమందు. దీనిని నీళ్లలో, నిమ్మ రసం, ఛాయ్‌లలో కలుపుఒకని తాగుతుంటారని, ఇది ఆరోగ్యానికి హానికరమైన డ్రగ్ అని సీపీ తెలిపారు. ఎస్ఓటీ అధికారులు, మీర్పేట్ ఇన్స్పెక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ముంబై నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌కు తీసుకువచ్చి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఒక కార్ డ్రైవర్‌ను ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అదనపు డీసీపీ అందె శ్రీనివాస్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ కడపకు చెందిన షేక్ మహ్మద్ హనీఫ్, చాంద్పీర్ అనే చిన్ననాటి స్నేహితుడి సలహాతో డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. ముంబై వెళ్లి అక్కడ విక్కీ, రోహిత్ అనే వ్యక్తుల వద్ద నుంచి రూ. 3500 గ్రాము చొప్పున ఎండీఎంఏ డ్రగ్స్ కొని హైదరాబాద్‌లోని కార్ఖానా, ధోబీఘాట్ ప్రాంతంలో కస్టమర్ల కోసం వేచి చూస్తున్నాడు. విశ్వసనీయ సమాచారంతో ఇన్స్పెక్టర్ నాగార్జున టీమ్ నిందితుడిని పట్టుకొని 13.9 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది.