అంతర్జాతీయ స్థాయి డ్రగ్స్ స్మగ్లర్ టోనీ అరెస్టుతో బడా వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ‘ఎవరినీ వదిలేదేలే..’ అంటూ విచారణలో వేగం పెంచిన పోలీసులకు తమ పేర్లు చెబుతాడేమోనని డ్రగ్స్ వాడిన వ్యాపారులు వణికిపోతున్నారు. పంజాగుట్ట పోలీసులు టోనీని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే.. సినీ ప్రముఖుల పేర్లు సైతం బయటపడే అవకాశం ఉందని సమాచారం.
సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ టోనీ, అతడి కస్టమర్లు అయిన బడా వ్యాపారులు, ఏజెంట్లను మొత్తం 22 మందిని నిందితులుగా చేర్చారు. టోనీ నోరు విప్పితే మరింత మంది డ్రగ్ వినియోగదారుల పేర్లు బయటకు వచ్చే అవకాశాలున్నాయి. టోనీ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ప్రస్తావించారు.
సమాచారమిచ్చిన ఏజెంట్లు
ఈ నెల 6వ తేదీన టోనీ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి ద్వారా కీలక సమాచారాన్ని రాబట్టారు. వారిచ్చిన సమాచారంతో ముంబైలో నిఘా వేసిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ టోనీని అరెస్ట్ చేశారు. టోనీ ఉపయోగించిన కారు పోలీసులకు కీలక ఆధారంగా మారింది.
విచారణలో బడా వ్యాపారుల పేర్లు
టోనీని విచారించడంతో అతడితో సంబంధమున్న 13మంది వినియోగదారుల పేర్లు వెల్లడించాడు. అందులో ఇద్దరు మినహా మిగతా వారంతా బడా వ్యాపారులే. ఎవరైతే మాకేంటీ అంటూ పోలీసులు గురువారం టోనీతో సంబంధమున్న ఏడుగురు బడా వ్యాపారులను అరెస్ట్ చేసి, వారికి సహాయం చేసిన ఇద్దరు ఆఫీస్బాయ్లను కటకటాల్లోకి పంపించారు. టోనీ నెట్వర్క్ మరింతగా విస్తరించి ఉంది. దర్యాప్తులో ఆ విషయాలు వెలుగులోకి రానున్నాయి. పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలను పోలీసులు రంగంలోకి దింపారు.
బట్టల వ్యాపారంతో మొదలు..
2013లో ఇండియాకు వచ్చిన టోనీ కొన్నాళ్లు సాఫీగా బట్టల వ్యాపారం నిర్వహించాడు. డ్రగ్స్‌కు అలవాటు పడి, డ్రగ్స్ మాఫియా కింగ్‌గా మారాడు. పాస్‌పోర్టు గడువు పూర్తయి ఏండ్లు గడుస్తున్నా.. అక్రమంగా ముంబైలో తిష్టవేసి అంతర్జాతీయ స్థాయిలో తన డ్రగ్స్ దందాను నిర్వహిస్తున్నాడు. టోనీని కస్టడీలోకి ఇస్తే అతడి నెట్వర్క్ తెలుస్తుందని, ఆ నెట్‌వర్క్‌ను ఛేదించడం వల్ల డ్రగ్ సరఫరా హైదరాబాద్‌కు రాకుండా ఉంటుందని పోలీసులు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు.
రెండేండ్లలోనే అంతర్జాతీయ స్థాయిలో కీలక స్మర్లర్గా..
టోనీ తన నెట్‌వర్క్‌ను ఇంటర్నెట్ కాల్స్, నైజీరియాకు చెందిన వాట్సాప్ నంబర్‌తోనే సంప్రదింపులు చేస్తుంటాడు. దీనికి తోడు డార్క్‌నెట్‌ను ఉపయోగిస్తూ డ్రాగ్స్ క్రయ, విక్రయాలకు సంబంధించిన ఆర్డర్లను తీసుకుంటున్నాడు. ఎక్కడ కూడా బయటకు కన్పించకుండా వాట్సాప్, డార్క్నెట్ల ద్వారా ఆర్డర్లు తీసుకొని, తన ఏజెంట్ల ద్వారా వాటిని చేరాల్సిన చోటకు చేర్చేస్తున్నాడు. సాంకేతికంగా టోనీ నైపుణ్యం కలిగి ఉండటంతో ఎవరికీ చిక్కకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నాడు. 2019 నుంచి డ్రగ్స్ మాఫియాలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. రెండేండ్ల కాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో టోనీ కీలక స్మగ్లర్‌గా ఎదిగాడు.
వెస్ట్రన్ యూనియన్ ద్వారా లావాదేవీలు
హైదరాబాద్‌లో నిత్యం డ్రగ్స్ వాడే వారి సమాచారాన్ని ముంబైలో డ్రగ్స్ విక్రయించే వారి వద్ద నుంచి సేకరించాడు. 2019 నుంచి హైదరాబాద్‌లోని పలువురు బిల్డర్లు, కాంట్రాక్టర్లు, మాసాజ్ వ్యాపారులు, ఫైనాన్షియర్లు, తదితరులతో టోనీ సంప్రదింపులు చేశాడు. టోనీ వాట్సాప్‌లో మెసేజ్ పెట్టగానే.. తమకు అందించాలంటూ వ్యాపారులు సమాచారం ఇస్తారు. డబ్బులు ఆన్లైన్లోనే పంపిస్తారు. డ్రగ్స్ డిమాండ్ ఎక్కువగా ఉండటంతో నైజీరియా నుంచి అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ ‘స్టార్ బాయ్’కి ఆర్డర్ ఇస్తూ వెస్ట్రన్ యూనియన్ ద్వారా డబ్బులు పంపిస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది.
మరింత మంది పేర్లు..!
టోనీ డైరీలో మొదట 13మందిని పోలీసులు గుర్తించారు. అందులో ఏడుగురు వ్యాపారులను, ఇద్దరు ఆఫీస్బాయ్లను అరెస్ట్ చేశారు. ఇప్పటికే బయటకు వచ్చిన పేర్లలో కొందరిని అరెస్ట్ చేయాల్సి ఉంది. టోనీని 10 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించాలని పంజాగుట్ట పోలీసులు భావిస్తున్నారు. డ్రగ్స్ కొనుగోలు చేసిన వ్యాపారులను కూడా విచారించనున్నారు. వీరిచ్చే సమాచారంతో మరింత మంది బడా వ్యాపారుల పేర్లు బయటకు రానున్నాయి. ఇందులో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారి పేర్లు కూడా ఉండే అవకాశాలున్నాయి.
పార్టీ ఉందంటే డ్రగ్స్ రావాల్సిందే..!
ఒకసారి ఒక వ్యాపారి వీకెండ్ పార్టీ ఇచ్చాడంటే అందులో తప్పని సరిగా డ్రగ్స్ వాడుతుంటారు. ఆ పార్టీకి వచ్చిన వారు మరుసటి రోజు పార్టీ జోరుగా సాగిందని, తరువాత తన పార్టీకి కూడా డ్రగ్స్ తెప్పించాలనే ఒప్పందం చేసుకొని టోనీకి ఆర్డర్ ఇస్తుంటారు. ఇలా ఒకరి నుంచి మరొకరికి పార్టీలో డ్రగ్స్ తప్పని సరి అనే కాన్సెప్ట్‌తో శ్రీమంతులైన బడా వ్యాపారులు దావత్‌లు నిర్వహించారు. కొందరు పబ్బులలో పార్టీలిస్తే, మరికొందరు తమ ఇండ్లలోనే పార్టీలు చేశారు. మరికొందరు ఫామ్ హౌస్‌లలో రేవ్ పార్టీలు కూడా నిర్వహించినట్లు తెలుస్తుంది. ఎక్కడికైనా డ్రగ్స్ టోనీ పంపించాల్సిందే.