సిటీబ్యూరో, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ): మాదక ద్రవ్యాల ముఠాను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ టీం శనివారం అరెస్టు చేసింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..ఏపీలోని సీతంపేట్ గ్రామానికి చెందిన మానుకొండ సత్యనారాయణ గోవాలో ఉంటున్నాడు. హైదరాబాద్‌కు చెందిన శివశంకర్‌రెడ్డి(26), మణికాంత్(26), శిల్పరాయ్(27)లను ఏజెంట్లుగా నియమించుకుని వారితో డ్రగ్స్, గంజాయి తదితర మత్తు పదార్థాలను విక్రయిస్తూ దందాను కొనసాగిస్తున్నాడు. శిల్పారాయ్.. సత్యనారాయణ ఆదేశాల మేరకు అరుకు వెళ్లి.. అక్కడ గంజాయి, చరస్‌ను తీసుకుని ప్రైవేట్ బస్సులో హైదరాబాద్‌కు వచ్చి… శివశంకర్‌రెడ్డి, మణికాంత్లకు ఫోన్ చేస్తుంది. వారు శిల్పరాయ్ను తీసుకుని సత్యనారాయణ బుక్ చేసిన ఓయో రూమ్స్‌లో ఈ మత్తు పదార్థాలను నిల్వ ఉంచుతారు.
ఆ తర్వాత వాటిని తీసుకొని.. శిల్పరాయ్ గోవాకు వెళ్లి.. సత్యనారాయణకు అందిస్తుంది.అనంతరం సత్యనారాయణ ఇచ్చే ఎండీఎంఏ, ఎల్ఎస్డీ బ్లాట్స్ డ్రగ్స్‌ను తీసుకుని తిరిగి హైదరాబాద్‌కు వస్తుంది. ఎండీఎంఏ డ్రగ్ గ్రాముకు రూ.5 వేలు, ఎల్ఎస్డీ బ్లాట్స్ ఒక దానికి 2 వేల రూపాయలను తీసుకుని మత్తు బాబులకు విక్రయిస్తారు. ఇలా కొన్నేండ్లుగా గోవా నుంచి సత్యనారాయణ ఆదేశాల మేరకు ఈ ముగ్గురు కమీషన్లను తీసుకుని నగరంలో డ్రగ్స్ దందాను నడిపిస్తున్నారు. సమాచారం అందడంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ టీం ఈ ముగ్గురిని అరెస్టు చేసింది. వారి వద్ద నుంచి 10 కేజీల గంజాయి, 4-ఎల్ఎస్డీ బ్లాట్స్, 30 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గోవాలో ఉన్న ప్రధాన సూత్రధారి సత్యనారాయణ పరారీలో ఉన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి తెలిపారు.