ఖైరతాబాద్, ఏప్రిల్ 21 : అధిక వడ్డీ ఆశ చూపి ఓ బోగస్ ఫైనాన్స్ కంపెనీ తమను ముంచిందని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భూ నిర్వాసితులు వాపోయారు. సుమా రు 2,500 మందికి ప్రాజెక్టు భూ సేకరణలో భాగంగా వచ్చిన పరిహారాన్నంతా ఓం సాయిరామ్ ఫైనాన్స్ కంపెనీ లో పెట్టించి మోసగించారని, డబ్బులు తిరిగి ఇవ్వమని కోరితే వేధింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికే 103 మంది చనిపోయారని తెలిపారు.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం మీడియా సమావేశంలో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. బాధితురాలు ఎల్లమ్మ మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డి భూ నిర్వాసితులకు ప్రభుత్వం మార్కెట్ ధర ప్రకారం డబ్బులు చెల్లించిందని, సుమారు రూ.35లక్షలు ఆ ఫైనాన్స్ కంపెనీలో పెట్టుబడి పెట్టానని తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా వడ్డీలు, అసలు ఇవ్వకుం డా వేధిస్తున్నారని వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కొద్ది మందిని అరెస్టు చేసి అసలు నిం దితులను పట్టుకోవడం లేదని, అబ్స్కాండింగ్ అని చెబుతున్నారని, వారు మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వెంట తిరుగుతున్నారని పేర్కొన్నారు.
2,500 మంది భూనిర్వాసితుల వద్ద సదరు ఫైనాన్స్ కంపెనీ వందల కోట్లు వసూలు చేసిందని ఆరోపించారు. తమకు తమ జాగను కానీ, పెట్టుబడి కానీ వాపసు ఇవ్వాలని, లేని పక్షంలో తమకు ఆత్మహత్యే శరణ్యమన్నారు. అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజిపేట, గోరిటకు చెందిన డి. దస్తగిరి మాట్లాడుతూ.. తన కొడుకు తిరుపతయ్య 2010లో భారత ఆర్మీలో చేరాడని, కశ్మీర్లో పనిచేస్తూ అనేక ఆపరేషన్లలో పాల్గొన్నాడని, 2013 మార్చి 14న రోడ్డు ప్రమా దం కారణంగా నాగర్‌కర్నూల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని, ప్రభుత్వం తరపున రూ.40లక్షలు వస్తే సదరు ఫైనాన్స్ కంపెనీలో పెట్టుబడిపెట్టి మోసపోయానన్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా నర్సాయిపల్లికి చెందిన నాగమ్మ మాట్లాడుతూ.. తాను సుమారు రూ.8.50లక్షలు ఫైనాన్స్ కంపెనీకి చెల్లించానని, రెండు సంవత్సరాలుగా డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తున్నారన్నారు. తమకు అండగా ని లబడ్డ జిల్లా ఎస్పీలను బదిలీ చేయించారని తెలిపారు. తమ డబ్బులు తమకు ఇవ్వాలని సదరు ఫైనాన్స్ కంపెనీ నిర్వాహకులను అడిగితే కేసులు పెట్టుకున్నావు కదా కోర్టులోనే తేల్చుకుందామని అంటున్నారన్నారు.
నాగర్‌కర్నూల్‌కు చెందిన భాగ్యమ్మ మాట్లాడుతూ.. తాను రూ.8లక్షల పెట్టుబడి పెట్టానని, తమకు న్యాయం చేయాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట బాధితులమంతా ధర్నా చేస్తే నెలరోజుల్లో సమస్య పరిష్కరిస్తానని చెప్పిన జిల్లా ఎస్పీ ఏడాది గడుస్తున్నా ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదన్నారు. ముఖ్యమంత్రి స్థానికుడే అయినా దొంగల వంత పాడుతున్నారని ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే ముఖ్యమంత్రి ఇంటి ముందు నిరసన కార్యక్రమాన్ని చేపడుతామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, అరుణోదయ విమలక్క ,తదితరులు పాల్గొన్నారు.