సిటీబ్యూరో: కాంగ్రెస్ ఫార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు గడుస్తున్నా హామీలు నెరవేర్చలేదని తెలంగాణ వాహన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా శుక్రవారం బేగంపేటలోని ప్రజాభవన్ ముందు డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ఆటో, క్యాబ్‌లను నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నామన్నారు.
గిరాకీ లేక తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలన్నారు. తెలంగాణ క్యాబ్ అసోసియేషన్ నాయకుడు నగేశ్ మాట్లాడుతూ.. గిగ్ వర్కర్లను ఆదుకుంటామని మాటిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఏమీ చేయలేదని వాపోయారు. ప్రత్యేక యాప్ తీసుకొచ్చి డ్రైవర్స్‌కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మోసం చేశారని ఆరోపించారు. డ్రైవర్ల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో రాజు, పాషా తదితరులు పాల్గొన్నారు.