జూబ్లీహిల్స్, జనవరి 4: నగరంలో ఒకప్పుడు ఆత్మగౌరవంతో బతికిన ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారిపోతున్నది. ఆటో నడుపుకొని భార్య, పిల్లలకు కడుపు నిండా తిండిపెట్టి సంతోషంగా బతికిన ఆటో డ్రైవర్ల జీవితాలు బుగ్గిపాలవుతున్నాయి. పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక.. ఆటో కిస్తీలు చెల్లించలేక.. ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్ పథకం ప్రవేశపెట్టడంతో ప్రయాణికులు లేక సతమతమవుతున్న ఆటో డ్రైవర్లకు అండ ఎవరు ఉన్నారన్న ప్రశ్న తలెత్తుతున్నది.
యూసుఫ్‌గూడ డివిజన్ లక్ష్మీనరసింహానగర్కు చెందిన రవి (25) ఆర్థిక ఇబ్బందులతో రెండు రోజుల కిందట ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. మూడు నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్న ఆటో డ్రైవర్ రవి సుమారు రూ.3 లక్షల అప్పులు ఉన్నాయన్న మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల శబరిమల యాత్ర పూర్తిచేసుకుని వచ్చిన రవి తాను నమ్ముకున్న ఆటోతో అప్పుల భారాన్ని అధిగమించలేనని మానసిక ఒత్తిడికి గురై.. తనను నమ్ముకున్న వాళ్లకు దూరమయ్యాడు.
కాంగ్రెస్ సర్కారు ఉచిత బస్సు పథకం పెట్టాక..రాష్ట్రంలో ఇప్పటివరకు 1,068 మంది ఆత్మహత్యలకు పాల్పడగా, అందులో నగరానికి చెందిన ఆటో డ్రైవర్లే ఎక్కువగా ఉన్నారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న సంక్షేమ బోర్డు ఊసే లేదు.. మహాలక్ష్మి పథకంతో నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ. 12 వేలు ఇస్తామన్న హామీ అమలు కాలేదు. కేంద్రం ప్రభుత్వం 2019 లో ఆటో డ్రైవర్లకు తీవ్ర నష్టం కలిగించేలా ప్రవేశపెట్టిన రోడ్ సేఫ్టీ బిల్లును కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయక అడ్డుకోగా, రేవంత్ ప్రభుత్వం అమలు చేయడంతో డ్రైవర్లకు లైసెన్స్‌లు మంజూరు కావడం గగనంగా మారిపోయింది.
అంతేకాకుండా ఇన్యూరెన్స్‌లు పెరగడం.. ఆటో మీటర్ రేట్ ఇప్పటి వరకు పెంచకపోవడం.. ఇటీవల వచ్చిన 20 వేల ఎల్పీజీ, జీఎన్జీ ఆటోలకు పర్మిట్లు ఇవ్వకపోవడం తదితర కారణాలతో ఆటో డ్రైవర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. దీంతో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం బాధాకరం