కుత్బుల్లాపూర్, నవంబర్16: బిగ్ బాస్కెట్ వేర్‌హౌజ్‌లో డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…మేడ్చల్ నియోజకవర్గం ఘన్పూర్ గ్రామానికి చెందిన మేకల బాబు(27) గుండ్ల పోచంపల్లిలోని బిగ్ బాస్కెట్ వేర్‌హౌస్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి బాబు ఇంటికి వెళ్లకపోవడంతో బంధువులు బాబు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది.
దీంతో ఆదివారం ఉదయం ఫోన్ చేయగా ఇతరులు ఫోన్ లిఫ్ట్ చేసి తమకు ఫోన్ దొరికిందని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత బిగ్ బాస్కెట్ నిర్వాహకులు బాధితుడి బంధువులకు ఫోన్ చేసి బాబు బాత్రూంలో పడి చనిపోయాడని సమాధానం ఇచ్చారు. పొంతన లేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చిన బంధువులు పెద్ద ఎత్తున గ్రామస్తులను ఏకం చేసుకొని బిగ్ బాస్కెట్ వేర్‌హౌజ్‌కు వెళ్లారు. నిర్వాహకులు బాబు మృతిపట్ల సరైన సమాధానం చెప్పకపోవడంతో బాధితులు వేర్‌హౌజ్ ముందు ఆందోళనకు దిగడంతో అప్పటికే అక్కడున్న పేట్ బషీరాబాద్ పోలీసులు ఆందోళనకారులను శాంతింపజేశారు. కాగా బాబు మృతిపట్ల కుటుంబ సభ్యులు పలు అనుమానాలను వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.