Hyderabad | న్యూస్ నెట్వర్క్, మార్చి8, (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో నీటి కష్టాలు స్వాగతం పలుకుతున్నాయి. వేసవి కాలం ప్రారంభ దశలోనే ఈ స్థాయిలో ఉంటే ఎండలు ముదిరితే పరిస్థితేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్లలో తాగు నీటి కష్టాలు తీర్చాలంటూ ప్రజాభవన్ మెట్లెక్కారు. మాజీ సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ నీటిని తీసుకువచ్చి ఇంటింటికిచ్చి ప్రజల దాహార్తిని తీర్చితే, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం కరవొచ్చిందని తిట్టుకుంటున్నారు.
ఇదే అదునుగా అక్రమ వసూళ్లు..
కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో నీటి సమస్య జటిలంగా మారింది జలమండలి సరఫరా చేసే నీరు సరిపోక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధాన కాలనీల్లో ట్యాంకర్లను బుక్ చేసుకోగా, ట్యాంకర్ కు 800 నుంచి 1200 వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ ట్యాంకర్ల నిర్వాహకులు 1800 వరకు వసూలు చేస్తున్నారు. రంగారెడ్డి నగర్ డివిజన్ ఆదర్శ్ నగర్లో ట్యాంకర్లు బుక్ చేసుకుంటే రెండు రోజుల తర్వాత వస్తున్నాయి. కాలనీలోని 4 బోర్లు ఇప్పటికే ఎండిపోయాయి. తమ ఇండ్లను కమర్షియల్ గా మార్చుకోవాలని పలువురిని జలమండలి సిబ్బంది హెచ్చరించారని కాలనీ వాసులు వాపోతున్నారు.
పేట్ బషీరాబాద్, యాదిరెడ్డి బండ, సయ్యద్ నగర్ ప్రాంతాల్లో నాలుగు రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతున్నది. అయితే అరగంట పాటు మాత్రమే నీటిని సరఫరా చేస్తుండగా అరకొర నీటితో ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. మక్దూంనగర్, సోమయ్య నగర్, శ్రీనివాస్ నగర ప్రాంతాల్లో సరిపడా నీళ్లు రాక భూగర్భ జలాలు వినియోగిస్తున్నారు. అవి కూడా అయిపోతే పరిస్థితేంటని ఆందోళన చెందుతున్నారు. ఓఆర్ఆర్ బయటున్న కాలనీల్లో జలమండలి నీటి కనెక్షన్లు ఇవ్వకపోవడంతో ఆయా కాలనీలు, కమ్యూనిటీలు నీటిని కొనుగోలు చేసుకుంటున్నాయి.
పదిరోజులుగా..
దాసర్లపల్లి గ్రామంలో పది రోజులుగా నీటి సమస్యతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముచ్చర్ల ప్లాంట్ నుంచి ఆ గ్రామానికి ప్రతిరోజూ 1,60,000వేల లీటర్ల నీరు రావాల్సి ఉండగా, కేవలం 50 వేల నీరు కూడా ప్రస్తుతం రావడంలేదు.
నీటికోసం ప్రజాభవన్ మెట్లెక్కారు…
కేపీహెచ్బీ కాలనీ లో తాగునీటి కష్టాలను తీర్చాలంటూ కాలనీవాసులు ప్రజా భవన్ మెట్లెక్కారు. కాలనీ 1,2వ ఫేజ్లలో కలిపి 5000 కు పైగా ప్లాట్లు ఉండగా, 30 వేలకు పైగా జనాభా నివసిస్తున్నారు. వీరంతా జలమండలి సరఫరా చేసే నీటిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఎల్ఐజీలు, ఎంఐ జి ఫ్లాట్స్ ల లో ఉన్న బోరుబావులు ఉన్నప్పటికీ వేసవి ఎండలకు భూగర్భ జలమట్టం తగ్గిపోవడంతో ప్రజలకు సరిపడా నీరు అందుబాటులో లేకుండా పోయింది. శుక్రవారం కాలనీవాసులు ,అసోషియేషన్ నేతలు కలిసి ప్రజాభవన్ లో ప్లానింగ్ కమిషన్ చైర్మన్ చిన్నారెడ్డిని కలిసి నీటి సమస్యను పరిష్కరించాలని ఫిర్యాదును అందజేశారు.
వాటర్ ట్యాంకులు నిర్మించి వదిలేశారు..
అల్వాల్ సర్కిల్ కౌకూర్ భరత్ నగర్ లోని రాజీవ్ గృహకల్ప బాంబే భవన సముదాలలో దాదాపు 12 వేలమంది పేదలు నివసిస్తున్నారు. సముదాయాల వద్ద రెండు పెద్ద వాటర్ ట్యాంకులను నిర్మించారు. అయితే వాటి నుంచి గృహ సముదాయ భవనాలకు నల్ల కనెక్షన్లు ఇవ్వలేదు. ఇంటి ముందు డ్రమ్ములను పెట్టుకొని ట్యాంకర్ల ద్వారా వచ్చే నీటిని నింపుకొని వాడుతున్నారు. ఐదు రోజులకొకసారి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. సరిపడా నీటి సరఫరా చేయకపోవడంతో పేదలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. వెంకటాపురం డివిజన్ భూదేవి నగర్ లో ని రైల్వే ట్రాక్ కట్ట వద్ద దాదాపు 100 కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. వీరికి ప్రత్యేకంగా నల్ల కనెక్షన్లు లేవు, వాటర్ వర్స్ ద్వారా ట్యాంకర్లు నీటి సరఫరా చేస్తున్నారు.
బీఆర్ఎస్ హయంలో తాగునీటి సమస్య లేకుండే
మాజీ సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చి ఇంటింటికి నీళ్లనందించారు. ప్రస్తుతం మా గ్రామానికి రావాల్సిన మిషన్ భగీరథ నీరు సక్రమంగా రావడం లేదు. సమస్యను ఎండీవో దృష్టికి తీసుకువెళ్లాం.
-పోలేమోని బాలమణి అశోక్ ముదిరాజ్, తాజా మాజీ సర్పంచ్ .దాసర్లపల్లి
తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చకుండా చూడాలి
దాసర్ల పల్లి గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చకుండా చూడాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సమస్య ఏర్పడినట్లు స్పష్టమవుతుంది .కేసీఆర్ తీసుకొచ్చిన నీటిని సక్రమంగా పంపిణీ చేయకపోవడం బాధాకరం.
-తాండ్ర ఇందిరమ్మ దేవేందర్ తాజా మాజీ ఎంపీటీసీ తాజా మాజీ సర్పంచ్ దాసర్లపల్లి