దుండిగల్, ఫిబ్రవరి 25: అధికారుల అనాలోచిత నిర్ణయాలతోనే తాగునీటికి సమస్యలు తలెత్తుతున్నాయని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రైవేటు వాటర్ ట్యాంకర్ ల యజమానులకు జిల్లా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ తీసుకొని నీటి విక్రయాలు చేపట్టాలని ఇటీవల సంబంధిత శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. తెలంగాణ వాల్టా చట్టం 2002 ప్రకారం.. బోర్ బావుల ద్వారా ఇతరత్రా ద్వారా భూగర్భ జలాలను తోడటం, వాటిని డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్ అవసరాలకు విక్రయించడం చట్టరీత్యా ఆమోదయోగ్యం కాదని, ఒకవేళ వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని విక్రయించేవారు తప్పనిసరిగా జిల్లా గ్రౌండ్ వాటర్ కార్యాలయం నుంచి ఎన్ఓసీ తీసుకోవాలని స్పష్టం చేశారు.
గత రెండు మూడు రోజులుగా నీటిని విక్రయించకుండా ట్యాంకర్లను సీజ్ చేయడంతో మంగళవారం పలువురు ట్యాంకర్ల యజమానులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును ఆయన కార్యాలయం వద్ద కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. దీంతో స్పందించిన ఆయన వేసవికాలం ముదురుతున్న నేపథ్యంలో తాగునీటికి, ఇతర అవసరాలకు, నీటి వినియోగం మరింత పెరుగనున్నదన్నారు. అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ప్రజలకు నైతిక కష్టాలు తప్పేలా లేవని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్సీ రాజు సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వానికి, అధికారులకు ముందు చూపు లేకపోవడం వల్ల నీటి కొరత ఏర్పడిందని, బోరు మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి తేవడం, ట్యాంకర్లకు అదనంగా ఫీజులు కట్టాలని బెదిరించడం ఏంటని ఆయన అధికారులను నిలదీశారు. కాగా ప్రభుత్వం, అధికారులు కొత్త ఆంక్షలతో తమను వేధిస్తుండటంతో నిజాంపేట కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాలకు నీటి సరఫరాను నిలిపివేసినట్లు పలువురు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానులు తెలిపారు.