సిటీబ్యూరో : షాపూర్‌నగర్-2 జలమండలి ఫిల్లింగ్ కేంద్రంలో గత నెల 28న ఉదయం ఒక వినియోగదారుడు ట్యాంకర్ నీటి కోసం బుక్ చేశారు. ఆ సమయంలో సీరియల్ నెంబర్ వందకు పైగానే ఉంది. రోజు గడిచినా ట్యాంకర్ రాకపోవడంతో శనివారం మధ్యాహ్నం 12.15 గంటల ప్రాంతంలో ఆన్లైన్లో ట్రాక్ (బుకింగ్ స్టేటస్) పరిశీలిస్తే నెంబర్-80గా చూపింది. సాయంత్రం 5.46 గంటలకు చూస్తే నెంబర్-75గా ఉంది. ఈ ఫిల్లింగ్ కేంద్రంలో దాదాపు 80-90 ట్యాంకర్లు ఉన్నట్లు తెలిసింది. మరి… రెండు రోజుల్లో అంటే 48 గంటల్లో 25-35 ట్యాంకర్లు కూడా సరఫరా కాలేదంటే నమ్మవచ్చా? డిమాండు ఎక్కడ ఉంటుందో అక్కడే ‘అవకాశం’ ఉంటుందనేది బహిరంగ రహస్యం. కనీసంగా 5-10 నిమిషాలకు ఒక ట్యాంకర్ వెళ్లాల్సిన చోట బుకింగ్ చేసినవారి నెంబరు నెమ్మదిగా కదలడం వెనక ఎన్ని ట్యాంకర్లు పక్కకు పోయాయనేది అర్థం చేసుకోవచ్చు.
* కుత్బుల్లాపూర్ నియోజకవర్గవ్యాప్తంగా నెల రోజుల నుంచే నీటి కొరత మొదలైంది. 25వ డివిజన్ పరిధిలో 15 రోజులుగా గోదావరి జలాల సరఫరా నిలిచిపోయాయి. గత్యంతరం లేక వినియోగదారులు ట్యాంకర్లు బుక్ చేస్తే పరిస్థితి ఇలా ఉంది.
* హఫీజ్‌పేట, చందానగర్, కొండాపూర్, మాదాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో నల్లా నీళ్లు నాలుగు రోజులకోసారి వస్తున్నది. అందునా లో ప్రెషర్‌తో జలమండలి అధికారులు విడిచిన నీళ్లు సరిపోక జనం అవస్థలు పడుతున్నారు. ఇలా గ్రేటర్లో ఎండలు ముదరకముందే నీటి కటకట మొదలువుతున్నది. ఉష్ణోగ్రతలు పెరిగి నీటి వినియోగం పెరిగిన వెంటనే ప్రైవేటు నీటి వ్యాపారం జోరందుకుంది. భూగర్భ నీటిమట్టాలు గణనీయంగా పడిపోతున్నాయి.
నగరంలో నీటి వ్యాపారం రూ. కోట్లలో సాగుతున్నది. ఎక్కడపడితే అక్కడ బోర్లు వేసి అక్రమంగా తరలిస్తున్న నీటిని ఒక్కో ట్యాంకరు సైజును బట్టి రూ.2 వేల నుంచి రూ.10 వేలదాకా విక్రయిస్తున్నారు.
కొందరు సున్నం చెరువులో బోర్లను వేసి నీటిని ట్యాంకర్లలో తరలిస్తున్నారు. పరీవాహక ప్రాంతంలో మోటార్లు పెట్టి అవి బయటకు కనిపించకుండా మట్టితో చదును చేస్తున్నారు. రోజుకు 100కు పైగా ట్యాంకర్ల నీటిని సున్నం చెరువులోని బోర్ల ద్వారా తోడుతున్నారు.
అక్రమ బోర్ల ద్వారా నీటిని తోడేస్తుండటంతో బస్తీల్లోని బోర్లు అడుగంటుతున్నాయి. ఫలితంగా నగర ప్రజలు జలమండలి ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ట్యాంకర్లకు డిమాండ్ పెరగటంతో బుక్ చేసుకున్న 24 గంటల తర్వాత వస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. ప్రైవేట్ ట్యాంకర్లు గంటలోపే సరఫరా చేస్తుండటంతో ఎక్కువ డబ్బులు వెచ్చించి ప్రత్యామ్నాయం లేక కొంటున్నారు.