సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలో నోటిఫికేషన్ జారీచేసిన 24బార్లకు సంబంధించి నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం నార్సింగిలోని అడ్రస్ కన్వెన్షన్స్ అండ్ ఎగ్జిబిషన్ హాల్లో దరఖాస్తుదారుల సమక్షంలో నిర్వహించిన బార్ల డ్రా కార్యక్రమం లో ఆబ్కారీ శాఖ కమిషనర్ హరికిరణ్ పాల్గొని.. లక్కీ డ్రా తీశారు. గ్రేటర్ పరిధిలో 24బార్లకు నోటిఫికేషన్ జారీచేయగా వాటికి మొత్తం 3,525 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ దరఖాస్తులకు సంబంధించిన నంబర్లను టోకెన్ల రూపంలో ముద్రించి వాటిని డ్రా బాక్స్‌లో వేయగా కమిషనర్ హరికిరణ్ 24బార్లకు సంబంధించి 24సార్లు డ్రా తీశారు. ఈ క్రమంలో లాటరీ ద్వార బార్లను దక్కించుకున్న 24మంది వ్యాపారులకు కమిషనర్ అలాట్మెంట్ లెటర్లను అందచేస్తూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ హరికిరణ్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీతో పాటు నిజామాబాద్, మహబూబ్‌నగర్, జల్పల్లి ప్రాంతాల్లో లక్కీడ్రా ద్వారా బార్ల కేటాయింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని వెల్లడించారు.
బార్లను దక్కించుకున్న లైసెన్సీలు 90 రోజుల్లోగా బార్ల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసుకుని, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా డీసీ కే ఏ బీ శాస్త్రి, ఏసీ అనిల్ కుమార్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా డీసీ దశరథ్, ఏసీ ఆర్.కిషన్లతోపాటు ఈఎస్‌లు, ఏఈఎస్‌లు పాల్గొన్నారు.