చంపాపేట, ఏప్రిల్ 19: చంపాపేట డివిజన్లో (Champapet) పలు కాలనీలు చినుకుపడితే చాలు చిత్తడిచిత్తడి అవుతున్నాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతుండటంతో వీధుల వెంట మురుగు పారుతున్నది. పాలకులు మారుతున్నా, ఏండ్లు గడుస్తున్నా సమస్య మాత్రం అలానే ఉంటున్నది. చంపాపేట రెడ్డి కాలనీ రోడ్ నంబర్ 5లో డ్రైనేజీ మ్యాన్ హోల్స్ పొంగి మురుగుపారుతున్నది. గత కొన్నేండ్లుగా ఈ సమస్య ఇలాగే కొనసాగుతుంది. అయినా సంబంధిత అధికారులు కానీ, ప్రజా ప్రతినిధుల గాని పట్టించుకోవడం లేదు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్న చిత్తశుద్ధి లేకపోవడంతో వీధిలో ఉండే వారికి మురుగు సమస్య దీర్ఘకాలికంగా ఎదుర్కోక తప్పడం లేదు.
ఈ కాలనీ ఎక్కడో లేదు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎల్బీనగర్ మున్సిపాల్ పరిధిలోనే ఉంది. వీరు గ్రేటర్‌లోని అన్ని కాలనీలు చెల్లిస్తున్నట్లు గానే అన్ని రకాల ట్యాక్సీలు చెల్లిస్తూనే వస్తున్నారు. ప్రజల నుంచి అన్ని రకాల రుసుములు వసూలు చేసే అధికారులకు మాత్రం వారు ఎదుర్కొంటున్న మురుగు సమస్యను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ఏ మాత్రం లేకపోవడం గమనార్హం. సమస్య తలెత్తినప్పుడల్లా సంబంధిత వాటర్ వర్క్స్ అధికారులకు సమస్యను చేరవేస్తే, తాత్కాలికంగా గల్ఫర్ మెషిన్‌తో వచ్చి మ్యాన్‌హోళ్లలోని మురుగు నీటిని ఖాళీ చేసి చేతులు దులుపుకొంటున్నారు. కానీ ఈ సమస్య తరచూ ఎందుకు తలెత్తుతుందో యోచించి అందుకు చేపట్టాల్సిన చర్యలను చేపట్టకపోవడంలో మతలాబ్ ఏమిటో తమకే అర్థం కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎన్నేండ్లు మురుగు సమస్యతో తాము ఇబ్బంది పడాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.