ఖైరతాబాద్, డిసెంబర్ 28: జెండా, అజెండా ఒక్కటే ఉండాలని, రాజ్యాధికారమే బీసీల లక్ష్యం కావాలని బీసీ కమిషన్ మాజీ చైర్మన్, జాతీయ సామాజిక న్యాయవేదిక సమన్వయకర్త డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. జాతీయ సామాజిక న్యాయ వేదిక ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం “75 ఏండ్లుగా రాజ్యాంగం అమలు, అనంతరం కూడా రాజకీయ అంటరానితనంలోనే బీసీలు” అనే అంశంపై జరిగిన మేధోమథనం సదస్సులో డాక్టర్ కృష్ణ మోహన్‌రావు మాట్లాడుతూ, 75 ఏండ్లుగా దేశంలో రాజ్యాంగం అమలుల్లో ఉన్నా బీసీలు రాజకీయ అంటరాని తనానికి గురవుతూనే ఉన్నారన్నారు.
ప్రస్తుతం, దేశంలో బీసీ జనాభా 75 కోట్లు ఉండగా, 4,800 కులాలు ఉన్నాయని, కానీ, చట్ట సభల్లోకి వెళ్లని వారు 3,800 పైగానే ఉన్నారని, కనీసం వార్డు సభ్యుడు కాలేని స్థితి ఉందన్నారు. అధికార పార్టీలు కనీసం నామినేట్ పదవులను ఇవ్వడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను పట్టించుకోవడం లేదని, రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం, కులగణన చేసి, 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారని, దానిని నిలబెట్టుకోవాలన్నారు. వంద శాతం కులగణన చేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో లెక్కింపులు చేసినట్లు కనిపించడం లేదని, నేటికీ అనేక మంది తమ ఇంటికి కులగణన సర్వే కోసం రాలేదని చెబుతున్నారన్నారు.
ఇలాంటి క్రమంలో బీసీలకు ఎలాంటి న్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చట్టసభతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచాలన్నారు. దేశంలోని బీసీలు రాజకీయ పార్టీలు పెట్టుకొని రాజ్యాధికారాన్ని ఏలుతుందని, ఎంతో చైతన్యం కలిగిన తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజకీయ పార్టీ పెట్టుకొని తమ ఆకాంక్షలను సుసాధ్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కేవలం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి విస్మరిస్తే బీసీల సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వచ్చే జనాభా గణనలో బీసీ కులగణన చేయాలని డిమాండ్ చేశారు. ఇక దేహీ అనే యోచన లేదని, తమ హక్కులను పోరాడి సాధించుకుంటామన్నారు.
ఇక ఏ రాజకీయ పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం లేదని, రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీసీలను నిలబెట్టుకొని వారినే గెలిపించుకోవాలన్నారు. అందుకు ఐక్యంగా ముందుకు సాగాలని, గ్రామీణ స్థాయి నుంచి ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ప్రొఫెసర్ కె.మురళీ మనోహర్ మాట్లాడుతూ రాజ్యాంగం అమలైన తర్వాత అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించాల్సి ఉందని, కానీ, బీసీలను మాత్రం వెనుకబాటుకు గురిచేశారన్నారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బీఎస్ రాములు, బీసీ సంఘం నాయకులు దేవళ్ల సమ్మయ్య, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు, ప్రొఫెసర్ నరేంద్ర బాబు, ప్రొఫెసర్ పార్థసారధి, డాక్టర్ ఎస్. పృథ్విరాజ్, ప్రొఫెసర్ భాస్కర్, ప్రొఫెసర్ భాగయ్య, డాక్టర్ కోరే రాజ్ కుమార్, డాక్టర్ అంకం, దుండ్ర కుమారస్వామి, పాల్వాయి శ్రీనివాస్, గుజ్జ రమేశ్, పులిపాటి శ్రీనివాస్, మేరు భాస్కర్ రావు, ప్రొఫెసర్ కవిత, ప్రొపెసర్ రమాదేవి, రాచమల్ల బాలకిషన్, నర్మద, కల్యాణ్ పాల్గొన్నారు.