ఖైరతాబాద్, సెప్టెంబర్ 8: సంపూర్ణ ఆరోగ్యానికి, ముఖ్యంగా మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు సూచించారు. ఎర్రమంజిల్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ(ఏఐఎన్‌యూ) వైద్యశాలలో సోమవారం జాతీయ పోషకాహార వారోత్సవాలను వైభవంగా నిర్వహించారు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల పోషకాహారం ముఖ్యమని ఈ సందర్భంగా ఏఐఎన్‌యూ వైద్యులు చెప్పారు. మనం తినే ఆహారం నేరుగా కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపుతుందని, దీర్ఘకాల కిడ్నీ వ్యాధి(సీకేడీ), అధిక రక్తపోటు, షుగర్ వంటివి ఉన్నవాళ్లు ఆహారం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఏఐఎన్‌యూ సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గుండ్లపల్లి మాట్లాడుతూ సమగ్ర ఆరోగ్యానికి కాపాడడంలో కిడ్నీలు చాలా కీలకమని, ఆహారంలో కొద్దిపాటి మార్పులతో అంటే ఉప్పు తగ్గించడం, తగినంత ప్రోటీన్లు తీసుకోవడం, తాజా ఆహారాన్ని తినడం ద్వారా కిడ్నీ వ్యాధి ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐఎన్‌యూ వైద్యశాల చీఫ్ క్లినికల్ డైటీషియన్ తులసి తదితరులు పాల్గొన్నారు.