సిటీబ్యూరో, డిసెంబరు 9(నమస్తే తెలంగాణ): స్టేట్ ప్లాస్టిక్ సర్జరీ అసోసియేషన్ ఆఫ్ ఏపీ, తెలంగాణ వైస్ ప్రెసిడెంట్‌గా ఉస్మానియా దవాఖాన ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ పలుకూరి లక్ష్మి ఎన్నికయ్యారు. ఏపీలోని కాకినాడలో సోమవారం నిర్వహించిన స్టేట్ ప్లాస్టిక్ సర్జరీ సదస్సులో డా. లక్ష్మి ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ, స్కిన్ బ్యాంక్ స్కిన్ వల్ల కలిగే లాభాలు, ఉస్మానియా దవాఖానలో ఏర్పాటు చేసిన స్కిన్ బ్యాంక్ స్కిన్‌తో పునర్జీవం పొందిన రోగుల ఉదంతాల గూర్చి వివరించారు. స్కిన్ బ్యాంక్ స్కిన్‌తో తీవ్రంగా కాలిన గాయాలకు గురైన బాధితులను బతికించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఈ క్రమంలోనే 70% కాలిన గాయాలకు గురైన హమీద్ అనే రోగిని ఉస్మానియా స్కిన్ బ్యాంక్ స్కిన్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స ద్వారా బతికించగలిగామని వివరించారు.
సాధారణంగా 60 శాతం కాలిన గాయాలకు గురైతే బ్రతకడం చాలా కష్టమని, అలాంటిది 70 శాతం కాలిన గాయాలకు గురైన రోగిని స్కిన్ బ్యాంక్ స్కిన్ ట్రాన్స్‌ప్లాంట్ ద్వారా బతికించడం దేశంలోనే ఇది రికార్డు అన్నారు. అనంతరం, ఫేషియల్ రిజువినేషన్ సర్జరీస్పై లైవ్ కాడవరిక్ టెలికాస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, ఉస్మానియా ప్లాస్టిక్ సర్జరీ విభాగానికి చెందిన పీజీ వైద్యురాలు డా. రజియాకు ఉమ్మడి రాష్ట్రంలోనే బెస్ట్ బర్న్ పేపర్ అవార్డు లభించింది. అదే విభాగానికి చెందిన ఉస్మానియా పీజీలు డా. సనా భాను, డా. మసీరా, డా. హాదియా, డా. చందనలు ఉస్మానియా దవాఖానలో జరిపిన బర్న్స్, ప్లాస్టిక్, రీకన్స్ట్రక్టివ్ అండ్ కాస్మోటిక్ ప్రొసీజర్స్‌తో పాటు తీవ్ర గాయాలకు గురైన చిన్నారుల ప్రాణాలను స్కిన్ బ్యాంక్ స్కిన్‌తో ఎలా కాపాడవచ్చో వివరిస్తూ పేపర్స్, పోస్టర్లను సమర్పించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ డా. డి.వి.కృష్ణారావు, డా. రత్న భూషణ్, డా. పీవీ సుధాకర్ పాల్గొన్నారు.