NIPER | బాలానగర్ , ఆగస్టు 10 : నైఫర్ హైదరాబాద్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ బల్క్ డ్రగ్‌కు ఎంపికైందని కేంద్ర ఫార్మాస్యూటికల్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ డాక్టర్ అరుణిశ్ చావ్లా వెల్లడించారు. శనివారం బాలానగర్ పారిశ్రామికవాడలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైఫర్) ఆడిటోరియం హాల్లో నైఫర్ డైరెక్టర్ శైలేంద్ర సరాఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ డ్రగ్ డిస్కవరీ, డెలివరీ డయగ్నోస్టిక్స్ 2024 సదస్సుకు అరుణిశ్ చావ్లాతో పాటు నైఫర్ హైదరాబాద్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ సత్యనారాయణ, సీఎస్ఐఆర్ -ఐఐసీటీ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, నైఫర్ డీన్ నండూరి శ్రీనివాస్ హాజరయ్యారు.
అంతర్జాతీయ డ్రగ్ డిస్కవరీ సందర్భంగా నైఫర్ ప్రాంగణంలో మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటిక్స్, ఫార్మాకాలజీ, మెడికల్ డివైసెస్ సహా వివిధ రంగాలకు చెందిన 131 పోస్టర్, 22 మౌఖిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ సదస్సును పురస్కరించుకొని ప్రదర్శనలకు అవార్డులు అందజేశారు.
ఈ సందర్భంగా అరుణిష్ చావ్లా మాట్లాడుతూ ఫార్మారంగంలో తనకంటూ ప్రత్యేకత సాధించుకున్న నైఫర్ హైదరాబాద్ భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకోనుందన్నారు. నైఫర్ హైదరాబాద్ సంస్థను విస్తరించడం కోసం 160 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. రూ. 100 కోట్ల నిధులతో కేంద్ర ప్రభుత్వం బల్క్ డ్రగ్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు ఆమోదముద్రవేసిందని పేర్కొన్నారు.