ఖైరతాబాద్, ఏప్రిల్ 26: డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ (డీపీడీపీ) చట్టం 2023 అమలులోకి వస్తే జర్నలిస్టులు స్వేచ్ఛగా రాయడం, ప్రచురించడం కష్టతరమవుతుందని నేషనల్ క్యాంపెయిన్ ఫర్ పీపుల్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రతినిధులు హెచ్చరించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంజలి భరద్వాజ్, అమృత జోహ్రీ, రాకేశ్ దుబ్బుడు మీడియాతో మాట్లాడుతూ.. డీపీడీపీ చట్టం ప్రకారం జర్నలిస్టులు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికైనా, ప్రచురించడానికైనా సంబంధిత వ్యక్తుల అనుమతి తప్పనిసరి అవుతుందని వివరించారు.
దీనివల్ల సమాజానికి అవసరమైన, అవినీతి లాంటి కీలక విషయాలపై జర్నలిస్టులు జరిపే పరిశోధనాత్మక కథనాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ చట్టం ప్రభావం సమాచార హక్కు కార్యకర్తలపైనా పడుతుందని, అధికారుల వ్యక్తిగత సమాచారం పొందడం మరింత కఠినతరం కావచ్చని అన్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జర్నలిస్టుల స్వేచ్ఛను హరిస్తామంటే ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఆర్.రవికాంత్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు సి.వనజ, కార్యవర్గ సభ్యులు వి.బాపురావు, పద్మావతి, తిగుళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.