వడ్డించే వాడు మనోడైతే.. ఎక్కడ కూర్చున్నా పర్వాలేదన్నట్లు ఉందీ బల్దియా అధికారులు తీరు. కేబీఆర్ పార్కు వద్ద పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ పద్ధతిలో రూ. 3 కోట్లతో మల్టీలెవల్ స్మార్ట్(మెకనైజ్డ్) కార్ అండ్ మోటార్ సైకిల్ పార్కింగ్ ప్రాజెక్టు చేపడుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. బల్దియాకు రూ. 100 కోట్లు బకాయి పడిన వ్యక్తికి ఈ ప్రాజెక్టు అప్పగించడం చర్చనీయాంశమైంది.
ప్రాజెక్టు దక్కించుకున్న సదరు వ్యక్తి..గతంలో జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం నోటీసులు జారీ చేసింది. రూ. 100 కోట్లు బకాయి ఉన్నట్లు ఆ నోటీసుల్లో పేర్కొన్నది. ఈ నోటీసులకు వ్యతిరేకంగా సదరు వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానంలో ఈ అంశం ఉండగానే.. సదరు వ్యక్తి వేరే కంపెనీ పేరుతో కేబీఆర్ పార్కు మల్టీలెవల్ పార్కింగ్ ప్రాజెక్టు పనులను దక్కించుకోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఈ ప్రక్రియలో అధికారులు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలున్నాయి.
– సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ)
జీహెచ్ఎంసీ అధికారులు అక్రమార్కులకు అసరాగా నిలుస్తున్నారు. కాంట్రాక్ట్ చిన్నదైనా, పెద్దదైనా పలుకుబడిన వారికే పనులు దక్కేలా చేస్తున్నారు. కేబీఆర్ పార్కు వద్ద పీపీపీ విధానంలో రూ. 3 కోట్లతో చేపడుతున్న మల్టీలెవల్ స్మార్ట్ (మెకనైజ్డ్) కార్ అండ్ మోటారు సైకిల్ పార్కింగ్ ప్రాజెక్టు ఈ జాబితాలో చేరిందని జీహెచ్ఎంసీలో హాట్ హాట్ చర్చ జరుగుతున్నది.
ధనార్జనే ధ్యేయంగా ప్రైవేట్ వ్యక్తులకు జీహెచ్ఎంసీ ఆస్తులను అగ్గువకే కట్టబెట్టారని, టెండర్ల ప్రక్రియ మొదలుకుని క్షేత్రస్థాయిలో పనుల ప్రారంభం వరకు ఉన్నతాధికారుల పాత్రపై అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఒక వ్యక్తికి ప్రయోజనం చేకూర్చడానికి అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలు వస్తున్నాయి. బల్దియాకు వంద కోట్లు బాకీ ఉన్న వ్యక్తి కేబీఆర్ పార్కు మల్టీలెవల్ పార్కింగ్ ప్రాజెక్టు పనులను దక్కించుకోవడం చర్చనీయాంశమైంది. సంస్థకు బకాయిపడిన వ్యక్తికే మళ్లీ కొత్త పనులు అప్పగించిన అధికారుల పనితీరుపై అనుమానాలు కలుగుతున్నాయి.
వాస్తవంగా ఏదైనా పైలెట్ ప్రాజెక్టు చేపట్టాలని భావించినప్పుడు ముందుగా జీహెచ్ఎంసీ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాలి. ఆ తర్వాతనే ప్రభుత్వం నుంచి ప్రాజెక్టుకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేస్తున్నది. కానీ ఇక్కడ అలా జరగలేదు. గ్రేటర్లో 8 చోట్ల మల్టీలెవల్ కారు పార్కింగ్లు చేపట్టాలని, పైలెట్ ప్రాజెక్టుగా కేబీఆర్ పార్కు గేట్ -1 వద్ద మల్టీలెవల్ స్మార్ట్ (మెకనైజ్డ్) కార్ అండ్ మోటారు సైకిల్ పార్కింగ్ ప్రాజెక్టు పనులను డీబీఎఫ్ఓటీ పద్ధతిలో వెంటనే చేపట్టాలని సర్కారు జీహెచ్ఎంసీని ఆదేశిస్తూ గతేడాది మార్చి 14న జీవో నం 143ను జారీ చేసింది. అంతేకాకుండా గతంలో ఇచ్చిన జీవో నం 68 ప్రకారం గ్రేటర్లో 15 ఫీట్స్ కంటే ఎక్కువ ఎల్ఈడీ స్క్రీన్ (ప్రకటన బోర్డు)కు అనుమతి లేదు. కానీ కేబీఆర్ పార్కు వద్ద సదరు ఏజెన్సీకి సడలింపు ఇచ్చారు. నిబంధనలు తుంగలో తొక్కి ఈ జీవోను తీసుకువచ్చారని, టెండర్ ప్రక్రియను ఆగమేఘాల మీద పూర్తి చేశారని ఆరోపణలున్నాయి.
మల్టీలెవల్ స్మార్ట్ (మెకానైజ్డ్) కార్ అండ్ మోటారు సైకిల్ పార్కింగ్ సదుపాయం కల్పనకు డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేషన్, ట్రాన్స్ఫర్(డీబీఎఫ్ఓటీ) మోడ్‌లో పైలెట్ ప్రాజెక్టుగా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) విధానంలో ఆసక్తి ఉన్న ఏజెన్సీల నుంచి ఆర్ఎఫ్పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపొజల్)కు టెండర్ ఆహ్వానించారు. గతేడాది జూన్ 7న టెండర్ నోటిఫికేషన్ పిలిచి 15న తుది గడువు(రెఫరెన్స్ డాక్యుమెంట్ నం 5/సీటీఓ)తో టెండర్‌ను ముగించారు. ఈ క్రమంలోనే నవనిర్మాణ్ అసోసియేట్ సంస్థకు రూ. 28.23 లక్షలకు టెండర్ వేయగా..మెగా ఫ్యాబ్రికేటర్ రూ. 18 లక్షలకు టెండర్ వేశారు.
మూడో బిడ్డర్ రోషన్ కంపెనీ క్వాలిఫై కాలేదు. మొదటి బిడ్డర్ నవ నిర్మాణ్ అసోసియేట్ సంస్థకు కేబీఆర్ పార్కు మొదటి గేటు వద్ద స్మార్ట్ మెకనైజ్డ్ కార్, వెహికల్ పార్కింగ్ ప్రాజెక్టు పనులు అప్పగించారు. ఈ టెండర్‌పై ఆసక్తి ఉన్న వారు చాలా మంది ఉన్న ఎవరూ పాల్గొనకుండా పలుకుబడి కలిగిన వ్యక్తులకే కట్టబెట్టారన్న విమర్శలు వినిపించాయి. అంతేకాకుండా తొలుత 10 ఏండ్ల పాటు, ఆపై ఫలితాలను బట్టి మరో ఐదేండ్ల పాటు కొనసాగేలా లబ్ధి చేకూర్చారంటూ వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
తొలుత అభ్యంతరం..ఆ తర్వాత సై ఈ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ ముగిసిన తర్వాత మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదానికి ప్రతిపాదనలు పెట్టారు. ఈ పార్కింగ్ విధానంపై మొదటి సారి స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రతిపాదన తీసుకురాగా సభ్యులు తిరస్కరించారు. ఈ ప్రాజెక్టుపై మరింత వివరణ కావాలని సభ్యులు ఈ సందర్భంగా కోరారు. స్టాండింగ్ కమిటీ సభ్యులను కేబీఆర్ పార్కు వద్దకు తీసుకువెళ్లి పార్కింగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
అక్కడ సభ్యులు చాలా ప్రశ్నలు లేవనెత్తారు. ప్రైమ్ లొకేషన్లో 484 గజాల్లో జాగ ఇస్తున్నప్పుడు సంవత్సరానికి కేవలం రూ.28 లక్షలు చాలా తక్కువ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. స్మార్ట్ పార్కింగ్ ద్వారా క్యాంటీన్, ప్రకటనలకుగానూ సంవత్సరానికి రూ. కోట్లలో బిజినెస్ వస్తుందని, అలాంటప్పుడు ఇంత తక్కువ టెండర్ ఎలా ఇస్తారని అని ప్రశ్నించారు. ఇక్కడే బిగ్ బ్రదర్ ఎంట్రీతో చక చకా తదుపరి స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రతిపాదనకు ఆమోదం దక్కింది. ఈ ప్రాజెక్టుపై సీఎం కార్యాలయం నుంచి ఒత్తిడి ఉందంటూ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సభ్యుల వద్ద వ్యాఖ్యానించడం గమనార్హం.
కేబీఆర్ పార్కు వద్ద అసలు మల్టీలెవల్ కారు పార్కింగ్ ప్రాజెక్టు అవసరమా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొత్తగా తీసుకువచ్చిన ఈ ప్రాజెక్టు ద్వారా 72 కార్లకే పార్కింగ్ సౌకర్యం ఉంది. కానీ ఇప్పటికే అక్కడ 40 కార్లు పార్కింగ్ చేసుకునే సౌకర్యం ఉంది. అలాంటప్పుడు 32 కార్ల కోసం ఇది అవసరమా అని అటు వాకర్లు, ఇటు కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. ఇది పార్కింగ్ కోసం కాదు ప్రకటన ద్వారా ఏజెన్సీకి లబ్ధి చేకూర్చడమేనని అంటున్నారు. పార్కింగ్ సిస్టంలో గ్రౌండ్ లెవల్లో క్యాఫిటెరియా, కాంప్లెక్స్ చుట్టూ ఎల్ఈడీ సైన్‌బోర్డులు దర్శనమిచ్చి రూ. కోట్ల ఆదాయం ఆర్జించేలా అధికారులు ఏజెన్సీకి అగ్గువలో కట్టబెట్టారన్న విమర్శలు లేకపోలేదు. ప్రకటన రూపంలో వచ్చే ఆదాయంపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో సదరు కాంట్రాక్టర్‌కు కాసులు కురిపించే కామధేనువుగా పార్కింగ్ ప్రాజెక్టు మారనున్నదని చర్చ జరుగుతున్నది.
కేబీఆర్ పార్కు గేట్-1 వద్ద కడక్ చాయ్ సమీపంలో స్మార్ట్ మల్టీలెవల్ (మెకనైజ్డ్) కార్, మోటారు సైకిల్ పార్కింగ్ సదుపాయం కల్పించనున్నారు. ఈ మేరకు సదరు ఏజెన్సీ రూ. 3 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును దక్కించుకున్నారు.. 405 చదరపు మీటర్లలో మల్టీలెవల్ కారు పార్కింగ్ కాంప్లెక్స్‌లో 72 కార్లకు పార్కింగ్ స్థలాన్ని కలిగి ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 వరకు పనిచేయనున్నది. ఈ మల్టీలెవల్ కారు, మోటారు సైకిల్ పార్కింగ్ సదుపాయంలో సీసీటీవీ, అత్యాధునిక సౌకర్యాలతో కల్పించనున్నారు.
జీహెచ్ఎంసీ మల్టీ లెవల్ పార్కింగ్ కోసం పిలిచిన టెండర్లు కేవలం 484 గజాలకు మాత్రమే. కానీ సమీపంలోనే మరో 420 గజాల ఖాళీ జాగా ఉంది. కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్కింగ్ ఏరియాను పక్కనే ఉండే జాగాను వినియోగించే అవకాశం లేకపోలేదు. ప్రాజెక్టు ఆమలులో భాగంగా పార్కింగ్ ద్వారా వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువగా ఉన్నప్పటికీ గ్లో సైన్ డిస్ప్లే బోర్డు ద్వారా వచ్చే ఆదాయంపై జీహెచ్ఎంసీకి ఏ మాత్రం నియంత్రణలో ఉండదు. కానీ ఇవేవి లేకుండా 484 చదరపు గజాల జాగాను అగ్గువకే ఇవ్వడం పట్ల తీవ్ర చర్చ నడుస్తోంది.
దీంతోపాటు, కాంట్రాక్టర్‌కు అదనపు వసతులు ఏర్పాటు చేసుకుని, వాటి మీద చార్జీలు వసూలు చేసుకునే వెసులుబాటు ఇవ్వడంతో జీహెచ్ఎంసీ ఖజానాకు వచ్చే ఆదాయానికి గండిపడనుంది. కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు వెళ్లే రోడ్డుపై ఉన్న స్థలం విలువ గజం ఐదు లక్షల మేర పలుకుతున్నది. కానీ తక్కువ ధరకు ఇవ్వడం ఏమిటని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా అధికారుల అనాలోచిత నిర్ణయం కారణంగా అప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయగా…అవి ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. అంతేకాదు సుందరీకరణ పనుల్లో భాగంగా లక్షలాది రూపాయలు ఖర్చు వృథా అని చర్చ జరుగుతున్నది.