మేడ్చల్, ఫిబ్రవరి4(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజగిరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలపై సందిగ్ధం ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్న ప్రభుత్వ ప్రకటనతో జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. దీంతో జిల్లాలో ఎన్నికల నిర్వహణపై ప్రజలు అయోమయానికి గురువుతున్నారు. గతంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 61 గ్రామాలు 5 మండలాలు ఉండేవి. 61 గ్రామాల నుంచి ఇటీవలే గత ఏడాది సెప్టెంబర్లో 28 గ్రామాలను సమీపంలో ఉన్న మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. ప్రస్తుతం జిల్లా 34 గ్రామాలకే పరిమితమైంది. మిగిలిన గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయాలని గత వారం రోజుల కిందట జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా, దీనికి మద్దతుగా జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ పెద్దలను కలిసి మున్సిపాలిటీల్లో విలీనం చేయాలని కోరుతున్నట్లు తెలుస్తున్నది. మిగిలిన గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు అధికారుల ద్వారా తెలుస్తుండగా, తప్పనిసరిగా అ గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనమవుతాయని కాంగ్రెస్ నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు అనుమానంగానే కనపడుతున్నాయి.
28 గ్రామాల ఓటర్ జాబితా రద్దు..
మున్సిపాలిటీల్లో విలీనమైన 28 గ్రామాల ఓటర్ జాబితా రద్దు చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో విలీనమైన గ్రామాలు మున్సిపాలిటీ ఓటర్ జాబితాలో త్వరలోనే చేర్చనున్నారు. విలీనమైన గ్రామాలకు గత నెల 4న రాష్ట్ర గెజిట్లో ప్రకటించిన నేపథ్యంలో విలీన గ్రామాల ఓటర్ జాబితాను రద్దు చేశారు. మిగిలిన 34 గ్రామాలకు సంబంధించి 65,748 ఓటర్లు ఉన్నట్లు జాబితాను తయారు చేసి.. ఎన్నికల సంఘానికి నివేదికను జిల్లా అధికారులు ఇచ్చారు. జిల్లాలో మూడు మండలాలైన మేడ్చల్, శామీర్పేట, మూడుచింతలపల్లి మండలాలు ఉన్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 34 గ్రామాలకు సంబంధించి జనాభాతో పాటు ఓటర్ల జాబితాను సిద్ధం చేసి నివేదించారు.
మరిన్ని మండలాలు కలుపుతారా?
ప్రస్తుతం 3 మండలాలకే పరిమితమైన జిల్లాలో మరికొన్ని మండలాలు కలిపి జడ్పీని కొనసాగించేలా ప్రభుత్వం చూస్తున్నట్లు మరో ప్రచారం వినిపిస్తున్నది. ప్రస్తుతం ఉన్న మూడు మండలాల్లో మరో 3 మండలాలను అదనంగా చేసి 6 మండలాలను చేసి గ్రామాల సంఖ్యను పెంచేలా చూస్తున్నట్లు సమాచారం. అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న నాలుగు కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలను త్వరలోనే జీహెచ్ఎంసీ పరిధిలో విలీనం చేసే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మండలాల పెంపు, మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీ విలీనం, ఉన్న 34 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తారని జరుగుతున్న ప్రచారాలతో జిల్లా ప్రజలు అయోమయానికి గురువుతున్నారని చెప్పవచ్చు.