సిటీబ్యూరో, మార్చి 25(నమస్తే తెలంగాణ) అవుటర్‌పై డబుల్ డెక్కర్ ఇంటర్ ఛేంజ్ నిర్మాణ పనులను హెచ్ఎండీఏ వేగవంతం చేసింది. తొలిసారిగా ఓఆర్ఆర్పై రెండంతస్తుల ఫ్లైఓవర్‌తో బుద్వేల్ నుంచి వచ్చే వాహనాల రద్దీ భారీగా తగ్గనుంది. 182 ఎకరాల విస్తీర్ణంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో డెవలప్ చేసి విక్రయించిన బుద్వేల్ వెంచర్ నుంచి నేరుగా ఓఆర్ఆర్ మెయిన్ కాజ్ వేపైకి వెళ్లే విధంగా రెండు లైన్ల ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది.
రాజేంద్రనగర్- బుద్వేల్ రూట్ వైపులా వెళ్లే విధంగా పటాన్ చెరు వైపు, మరోకటి శంషాబాద్ మార్గానికి రెండు లైన్లలో నిర్మించనున్నారు. ఈ కారిడార్ 2.8 కిలోమీటర్ల మేర నిర్మించనుండగా అందులో సుమారు 400 మీటర్ల మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ రానుంది. కారిడార్ నిర్మాణానికి మొత్తం 42 పిల్లర్లను నిర్మించనుండగా ఇప్పటికే హెచ్ఎండీఏ పనులు మొదలుపెట్టింది. ప్రస్తుతం పనులు వేగంగా సాగుతుండగా ప్రాజెక్టు ఏడాదిన్నరలో అందుబాటులోకి వస్తుందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.