
చాదర్‌ఘాట్, ఆగస్టు 11 : మలక్‌పేట నియోజకవర్గంలోని పిల్లిగుడిసెల డబుల్ బెడ్రూంలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. శనివారం లబ్ధిదారులు సామూహిక గృహ ప్రవేశాలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. బ్లాక్‌లలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లను అత్యంత నాణ్యతా ప్రమాణాలతో నిర్మించారు. మలక్‌పేట నియోజకవర్గం పరిధిలో భారీ స్థాయిలో మొదటి సారి డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం జరుగడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పిల్లిగుడిసెల డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పిల్లిగుడిసెల్లో ఇంతకుముందు నివాసముండే 141 ఇండ్లను జీహెచ్ఎంసీ అధికారులు నేలమట్టం చేశారు. గుడిసెవాసుల వివరాలను ఐరిష్ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో వారి జాబితాను సేకరించారు.
స్టిల్ట్ +9 అంతస్తులతో బ్లాక్‌లలో నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. లబ్ధిదారులు తొమ్మిది అంతస్తులకు ఎక్కేందుకు 4 చోట్ల లిఫ్ట్ సౌకర్యం కూడా కల్పించారు. లిఫ్ట్ తదితర నిర్వహణ కోసం గ్రౌండ్ ఫ్లోర్ లో 19 వాణిజ్య దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. వాణిజ్య దుకాణాల పై వచ్చే అద్దెను లిఫ్ట్ తదితర నిర్వహణకు ఖర్చు చేయనున్నారు. మొత్తం 1.5 ఎకరాల స్థలంలో రెండు(ఏ, బీ) బ్లాక్‌లలో స్టిల్ట్+9 నిర్మాణాలు పూర్తయ్యాయి. మలక్‌పేట నియోజకవర్గంలోని చంచల్‌గూడ-సైదాబాద్ ప్రధాన రోడ్డు పై పిల్లిగుడిసెల వద్ద నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లు పెద్ద ల్యాండ్ మార్క్‌గా గుర్తింపు సంతరించుకుంది. ఒక్కో ఫ్లాట్‌లో 570 చ.అడుగుల సా మర్థ్యంతో నిర్మాణం జరుగుతుంది. 2 బెడ్ రూంలు, ఒక హాలు, వంట గది, ఒకటి అటాచ్డ్ వాష్‌రూం, మరొకటి కామన్ వాష్ రూం ను 570ఎస్ఎఫ్టీలో నిర్మించారు.
పిల్లిగుడిసెల డబుల్బెడ్రూం సామూహిక గృహప్రవేశాలకు ముస్తాబవుతున్నది. శనివారం గృహప్రవేశాలు చేసేందుకు లబ్ధిదారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గృహ ప్రవేశాలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం చావునీ డివిజన్ కార్పొరేటర్ ఎం.ఏ.సలాం షాహీద్ ప్రారంభోత్సవ పనులను పర్యవేక్షించారు. ఏర్పాట్ల వివరాలను ఏఈ మహేశ్‌ను అడిగి తెలుసుకున్నారు.