సిటీబ్యూరో: ఓల్డ్ మారేడ్‌పల్లి బస్తీవాసుల సొంతింటి కలను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమ సొంత స్థలంలో కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయకుండా అడ్డుకుంటున్నారని వాపోతున్నారు. ఓల్డ్ మారేడ్‌పల్లిలోని బస్తీలో గుడిసెలు, ఇరుకు గదుల్లో ఉంటున్న పేదలకు అప్పటి ఎమ్మెల్యే సాయన్న, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. మొత్తం 468 ఇండ్లను నిర్మించగా, మొదటి విడతలో 256 మందికి పట్టాలు పంపిణీ చేశారు.
మిగిలిన 212 మందికి నిర్మాణం పూర్తయిన వెంటనే రెండో విడతలో అందజేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఆ తర్వాత శాసనసభ ఎన్నికల కోడ్ రావడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇండ్లను పక్కకు పెట్టారు. ఉప ఎన్నికల్లో గెలిచిన శ్రీగణేశ్ వెంటనే పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల జాబితాను మార్చేందుకు ఎమ్మెల్యే శ్రీగణేశ్ కుట్ర చేస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మా ఇండ్లు మాకే ఇవ్వాలి
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏడాది నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా మాకు ఇండ్లు ఇవ్వడంలేదు. ఎన్ని సార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడంలేదు.
– టీ ఉమాశంకర్, ఓల్డ్ మారేడ్‌పల్లి
అధికారుల చుట్టూ..తిరుగుతున్నాం
ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఇండ్ల పట్టాలు పంపిణీ చేయడంలేదు. మా స్థలంలో కట్టిన ఇండ్లు మాకు ఇవ్వడానికి ఇంత ఆలస్యం చేయడమెందుకు?. ఇప్పటికే రెండో లిస్ట్‌లో మా అందరి పేర్లు వచ్చాయి. దాన్ని ఎమ్మార్వో నుంచి ఆర్డీవో దాకా అందరూ అంగీకరిస్తూ సంతకాలు చేశారు. అయినా పట్టాల పంపిణీ అపడానికి కారణమేంటో తెలియడం లేదు.
-ఎస్.రాజగోపాల్, ఓల్డ్ మారేడ్‌పల్లి