
సుసంపన్న వర్గాల కోసం ప్రైవేట్ సంస్థలు నిర్మిస్తున్న బహుళ అంతస్తులకు దీటుగా పేదల కోసం అంతే గొప్పగా ప్రభుత్వం డబుల్ బెడ్ గృహాలను నిర్మించి ఇస్తున్నది. అత్మగౌరవంతో బతికేలా ఖరీదైన ప్రాంతాల్లో లక్షల రూపాయలతో వీటిని కడుతూ ఉచితంగా కేటాయిస్తున్నది. ఐటీ కారిడార్‌ను ఆనుకొని ఉన్న కూకట్పల్లి నియోజకవర్గం కైత్లాపూర్‌లో నిర్మిస్తున్న ఇండ్లే ఇందుకు చక్కని ఉదాహరణ. రూ.12.45 కోట్ల వ్యయంతో సెల్లార్, సిల్ట్‌తో పాటు తొమ్మిది అంతస్తుల్లో జీహెచ్ఎంసీ కైత్లాపూర్‌లో డబుల్ బెడ్ రూం గృహాలను నిర్మిస్తున్నది. రెండు బ్లాకుల్లో 144 ఇండ్లను నిర్మించగా.. ఒక్కో దానికి రూ.8.65 లక్షలను ఖర్చు చేసి సకల సౌకర్యాలను కల్పించింది. కార్పొరేట్ అపార్టుమెంట్ల తరహాలో ఈ ఇండ్ల నిర్మాణం జరగ్గా.. పచ్చని పరిసరాలు, ఎల్ఈడీ వెలుగులతో ఈ గృహాలను తీర్చిదిద్దారు. ప్రస్తుతం మౌలిక వసతుల కల్పన పనులు తుది దశలో ఉన్నాయని.. ఈ నెలాఖరులోగా లబ్ధిదారులకు అందించే లక్ష్యంగా పని చేస్తున్నామని జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.