
సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ ) : ఆహ్లాదకరమైన సాగర తీరంలో ఆత్మగౌరవ సంబురానికి అంబేద్కర్ నగర్ వేదికైంది. సంపన్నులకే సాధ్యమయ్యే లేక్ వ్యూ గృహాలను పైసా ఖర్చు లేకుండా ఉచితంగా అంబేద్కర్‌నగర్ వాసులకు ప్రభుత్వం అందిస్తున్నది. ఒక్కో ఇంటిపై రూ. 8.50 లక్షలు ఖర్చు చేసి సకల సదుపాయాలతో కూడిన విలాసవంతమైన ఇండ్లను అందిస్తున్నది.. ఇందులో భాగంగానే పీవీ మార్గ్‌లోని అంబేద్కర్ నగర్లో రూ. 28కోట్లతో చేపట్టిన 330 డబుల్ బెడ్ రూం ఇండ్లను శనివారం మంత్రి కేటీఆర్ ప్రారంభించి లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేయనున్నారు. కండ్లు చెదిరే రీతిలో అందమైన సాగర తీరంలో ఈ ఇండ్ల నిర్మాణం జరగగా, పచ్చదనంతో పరుచుకున్న పరిసరాలు, పూలమొక్కల వరుసలు, చుట్టూ ఫెన్సింగ్, ఎల్ఈడీ వెలుగులు, విలాసవంతమైన ఇంటి నిర్మాణం ఇలా ప్రత్యేకతలతో కూడిన డబుల్ బెడ్ రూం ఇండ్లు చూడముచ్చటగా నిలుస్తున్నాయి. కాగా ఇండ్ల నిర్మాణంలో భిన్నమైన శైలి రోజురోజుకూ పెరుగుతున్నది..డబ్బున్న వారంతా రూ. కోట్లు వెచ్చించి తమకు ఇష్టమొచ్చిన రీతిలో నివాసాలను తీర్చిదిద్దుకుంటున్నారు. పేదలకైతే అలాంటి అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం పేదల ఆత్మగౌరవం పెంచేలా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి అందిస్తుండటం గమనార్హం.
పేద ప్రజలు ఎంతో గొప్పగా జీవించాలనే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి తలసాని పేర్కొన్నారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ తీరం వెంట అన్ని సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించడం జరిగిందని చెప్పారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా లబ్ధిదారులపై ఒక్క పైసా భారం పడకుండా పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వడం పట్ల సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా తలసాని కృతజ్ఞతలు తెలిపారు.
బేగంపేట్, జూన్ 25: పేద ప్రజలు గొప్పగా జీవించాలన్నది సీఎం కేసీఆర్ ఆశయమని సికింద్రాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ అన్నారు. రాంగోపాల్‌పేట డివిజన్ అంబేద్కర్‌నగర్‌లో నిర్మించిన 330 డబుల్ బెడ్రూం ఇండ్లను శనివారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయికిరణ్‌యాదవ్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్నదే డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ కార్యక్రమమని, ఈ ఘనత కేవలం తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బస్తీ వాసులు గణేశ్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.