CP Kothakota Srinivas Reddy | సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ‘ఎంత మందలించిన కొందరు సిబ్బందిలో మార్పు రావడం లేదు. పంజాగుట్ట ఠాణా మాదిరిగా మధురానగర్, బోరబండ పోలీస్‌స్టేషన్లనూ ప్రక్షాళన చేస్తా’ అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆ రెండు ఠాణాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సోమవారం ‘ఖాకీ కాసుల కక్కుర్తి’, ‘వ్యభిచార గృహాలనూ వదలట్లే’ అనే శీర్షికలతో ‘నమస్తే తెలంగాణ’లో కథనాలు రావడంతో అవినీతి అధికారుల్లో అలజడి మొదలైంది.
ఈ కథనాలపై విలేకర్లు సీపీని ప్రశ్నించడంతో ఆయన స్పందించారు. ఈ రెండు ఠాణాలు అలా ఎందుకు తయారవుతున్నాయో అర్ధం కావడం లేదన్నారు. మధురానగర్ ఠాణాలో స్పాట్ సెంటర్ (వ్యభిచార గృహం) నుంచి కానిస్టేబుళ్లు మామూళ్లు తీసుకుంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, దానిపై విచారణ కొనసాగుతున్నదన్నారు. ఇక నుంచి సస్పెన్షన్లు ఉండవని, ఉద్యోగం నుంచి తొలగించడమే ఉంటుందని సిబ్బందిని హెచ్చరించారు.
బండ్లగూడ ఠాణాలో ఓ కానిస్టేబుల్ పాన్ డబ్బాలో నుంచి మామూళ్లు తీసుకుంటున్నట్లు ఫిర్యాదురావడంతో విచారణ జరిపి నిజమని తేలడంతో సస్పెండ్ చేశామని సీపీ వెల్లడించారు. అలాగే ఆ రెండు ఠాణాల్లో అవినీతి, అక్రమాలపై ఫిర్యాదులు ఉన్నాయని, తగిన చర్యలు తీసుకుంటానని, పంజాగుట్ట ఠాణా మాదిరిగానే వాటిని కూడా ప్రక్షాళన చేస్తామన్నారు. అవినీతి, అక్రమాలు చేసే వారిని సస్పెండ్ చేస్తే భయం ఉండటం లేదని, ఇక నుంచి ఉద్యోగం నుంచి తొలగించడమే ఉంటుందని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా పనిచేయాలని సీపీ సిబ్బందిని హెచ్చరించారు.